Site icon vidhaatha

న్యూజిలాండ్ మ్యాచ్‌కి ముందు భార‌త్‌కి పెద్ద దెబ్బ‌..ఆ న‌లుగురు ఆట‌గాళ్ల ప‌రిస్థితి ఏంటి?

వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో భార‌త్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ముందుగా ఆస్ట్రేలియాపై మంచి విజ‌యం సాధించిన భార‌త్ ఆ త‌ర్వాత ఆఫ్ఘ‌నిస్తాన్,అనంత‌రం పాకిస్తాన్‌పై కూడా మంచి విజ‌యాల‌ని న‌మోదు చేసింది. ఇక బంగ్లాపై పెద్ద‌గా రికార్డ్ లేక‌పోయిన‌ప్ప‌టికీ భార‌త్ విజ‌యం ద‌క్కించుకుంది. ఇక మరి కొద్ది గంట‌ల‌లో ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు అన్నీ అపశకునాలే ఎదుర‌వుతున్న‌ట్టుగా క‌నిపిస్తుంది. బంగ్లా మ్యాచ్‌లో చీల‌మండ గాయం వ‌ల‌న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. రవీంద్ర జడేజా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు.

ఇక తాజాగా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడ‌గా, ఆ మ్యాచ్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ గాయ‌ప‌డిన‌ట్టు తెలుస్తుంది. బౌలర్ వేసిన ఫుల్‌టాస్ బాల్ అతని చేతికి బలంగా తాక‌డంతో నొప్పితో విల‌విల‌లాడాడు. అంతేకాదు ప్రాక్టీస్ అర్ధాంత‌రంగా ముగించి మైదానంని వీడాడు. అత‌ని గాయం తీవ్ర‌త ఎంత‌గా ఉందో తెలియడానికి స్కానింగ్ తీసారు. ఇక ఇషాన్ కిషన్‌ను తేనటీగ కుట్టగా.. అతన్ని కూడా ఆసుపత్రికి తరలించినట్టు స‌మాచారం. కంటి పైభాగంలో తేనెటీగ కుట్టడంతో బాగా వాసింది. దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

హార్దిక్ పాండ్యా గైర్హాజరీలతో సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ షమీ బరిలోకి దిగుతారని అంతా అనుకుంటున్న స‌మ‌యంలో ఈ అప‌శ‌కునాలు టీమిండియాని వేధిస్తున్నాయి. సూర్య గాయపడితే..ఇషాన్ కిష‌న్‌ని బరిలోకి దింపాల‌ని అనుకోగా, ఇషాన్ కిషన్‌కు కందిరీగ కుట్టడంతో తుది జట్టులోకి ఎవరు వస్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మ‌రోవైపు వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియాకు మెరుగైన రికార్డు లేకపోవడం ఆందోళ‌న క‌లిగిస్తుంది. ధోని, విరాట్ కెప్టెన్సీలోనే న్యూజిలాండ్‌పై భార‌త్ గెల‌వ‌లేక‌పోయింది. మ‌రి నేడు ఏమైన చ‌రిత్ర సృష్టిస్తారా అనేది చూడాలి.

Exit mobile version