Telangana | ఇంతకూ తప్పెవరిది? ప్రజలదా?.. కేసీఆర్‌దా?

  • Publish Date - April 11, 2024 / 03:20 PM IST

(విధాత ప్రత్యేకం)

‘సరే.. ఏదో నాలుగు పైసలకు దురాశపడి వాళ్లకు ఓటేసిండ్లుగనీ, ఇగ అటువంటి తప్పు చేయకుండ్రి. సూత్తాండ్లుకదా, పించన్ లేకపాయె, రైతుబందు లేకపాయె, నీళ్లు లేకపాయె, పంటలు ఎండవట్టె. ఎప్పుడన్న గిట్లుండెనా పదేండ్లల్ల?”

ఇది కేసీఆర్ ఓటమి తర్వాత ప్రజల్లోకి మొదటిసారి వచ్చి నల్లగొండలో మాట్లాడిన ప్రసంగంలోని ముఖ్యాంశం.

‘ఏదో ఆశపడి ఓటేసిండ్లుగని, మల్ల గట్ల గానియ్యకుండ్లి. అరె.. బ్రిడ్జిలు, ప్రాజెక్టలన్న తర్వాత ఒకటో రెండో ప్రాబ్లంస్ వస్తయ్. రాకుండ ఎట్లుంటయ్..? వాట్ని బాగుచేసుకోవాలె. అండ్ల బొచ్చెడు నీళ్లు పడతయ్. నేను నాల్రోజులు ఆడ కుర్చీ ఏసుకుని కూసుంటే దెబ్బకు బాగయితది. ఎవడు అడగడనుకుంటాన్లా? నా బొండిగె తెగినా తెలంగాణను అన్యాయం కానియ్య.’

ఇవి తర్వాత కరీంనగర్లో మాట్లాడిన మాటల్లో కొన్ని.

ఏం చెబుతున్నాయివి? బిఆర్ఎస్కు ఓటేయకుండా ప్రజలే తప్పుచేసారు.. అనుభవిస్తున్నారనే కదా! ఇదే కేసీఆర్, ఇదే నల్లగొండలో ఎన్నికలకు ముందు, ‘ప్రజలు విజ్ఞులు. ఎవరిని అందలం ఎక్కించాలో, ఎవరిని ఇంట్లో కూర్చోబెట్టాలో వారికి బాగా తెలుసు’ అన్నట్లు గుర్తు. అంటే ఎటుచూసినా, ప్రజలదే బాధ్యత. విజ్ఞులయ్యుంటే బిఆర్ఎస్కు ఓటేసేవారు. వెధవలు కాబట్టి, కాంగ్రెస్కు వేసి ఇప్పుడు అనుభవిస్తున్నారనేది ఆయన ప్రగాఢ విశ్వాసం. కేసీఆర్ మంచోడే, వాళ్ల ఎమ్మెల్యే అభ్యర్థులు మంచోళ్లే కానీ, జనాలు అత్యాశకు పోయి కాంగ్రెసుకు పట్టం గట్టారు.

ఇంకా మారరా..? ఎన్నికల ఫలితాలు చూసి, ఘోర ఓటమిపాలైన ఎవరికైనా ఓ రకమైన వైరాగ్యం రావాలి. పదేళ్ల అధికారం పెంచిపోషించిన అహంకారం దిగాలి. ఎక్కడ తప్పు జరిగిందన్న అంతర్మథనం మొదలవ్వాలి. ఈ ఓటమి ఓ గుణపాఠం కావాలి. మళ్లీ లేవాలి. లేచి, నిలిచి, గెలవాలి. ఏ పార్టీకీ, నేతకూ ఓటమి కొత్త కాదు. ఆ మాటకొస్తే కేసీఆర్కూ కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఉద్యమనేత కేసీఆర్కు, ముఖ్యమంత్రి కేసీఆర్కూ చాలా తేడా ఉంది.

ఉద్యమ సమయంలో ప్రజలతో మమేకమై, ఎండనక, వాననక తిరిగి, తండాలల్లో చింతచెట్టు కింద పడుకున్న కేసీఆర్కు, ప్రగతిభవన్ అనే కోటలో తనకు తనే గిరి గీసుకుని, ఎవరినీ రానీయకుండా ఓ కోటరీని ఏర్పాటు చేసుకుని, స్వంతంగా బందీ అయిన కేసీఆర్కు పోలికే లేదు. నిజానికి చాలా విషయాలు కేసీఆర్కు తెలియవు. కాదు..తెలియనివ్వలేదు. చుట్టూ ఉన్న కోటరీ అనబడే స్వార్థపరులు చేసిన నిర్వాకం అది. మంత్రైనా, ఎమ్మెల్యే అయినా, ఐఏఎస్, ఐపీఎస్లయినా ఈ కోటరీని దాటి ఆయన దాకా వెళ్లలేకపోయారు.

కోటరీ సృష్టించిన మిథ్యాప్రపంచంలో బతుకుతూ, వాళ్ల జయజయధ్వానాలు వింటూ తన్మయత్వం చెందిన కేసీఆర్కు అసలు నిజమేంటో తెలియదు. ఈ కోటరీ పెంచిన అహంభావం, అధికారం తదనుగుణంగా అనుమానాన్ని కూడా పెంచి, అస్మదీయులను దూరం చేసి, తస్మదీయులను దగ్గర చేసింది. ఆ ఫలితమే ఈ ఓటమి. అధికారంలో ఉన్నప్పుడు అన్ని అవమానాలను దిగమింగిన పార్టీ నేతలు ఇప్పుడు బయటపడుతూ, బయటకెళుతున్నారు. అధికారులైనా అంతే. అప్పుడు మాటలు పడ్డ వారందరూ ఇప్పుడు రేవంత్కు ఉడతాభక్తి సాయం అందిస్తున్నారు.

ఏమాటకామాటే చెప్పుకోవాలి.అపాత్రదానం చేయడంలో కేసీఆర్ది అందె వేసిన చెయ్యి. ఎందరో అనర్హులను అందలం ఎక్కించాడు. తన పట్ల విధేయత, విశ్వాసం చూపినవారిని దూరం చేసుకున్నాడు. అధికారం ఎంతటివారినైనా అంధులను చేస్తుందన్న నానుడి నిజమేనని మరోసారి రుజువు చేసాడు. వాస్తవానికి ఇప్పటికీ టీఆర్ఎస్(బిఆర్ఎస్ కాదు)కు ప్రజాబలం బాగానే ఉంది. కానీ, దాన్ని నిలబెట్టుకునే అత్యంత ముఖ్యమైన సంస్థాగత నిర్మాణం పార్టీలో మొదటినుంచీ లేదు. గ్రామస్థాయి నుండి తెలంగాణ భవన్కు సమగ్ర సమాచార పంపిణీ వ్యవస్థ ఇప్పటికీ లేదు.

ఆశ్చర్యకరంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దీనిపై దృష్టి సారించలేదు. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రవేశపెట్టిన గ్రామ వలంటీర్ వ్యవస్థ అయనకు అద్భుతంగా పనికివచ్చింది. ఏ మారుమూల గ్రామంలో చీమ చిటుక్కుమన్నా ముఖ్యమంత్రి స్థాయికి విషయం తెలిసిపోయే నెట్వర్క్ అది. పార్టీకి, ప్రభుత్వానికి వారధిలా పనిచేసిన వలంటీర్లు ఇప్పటికే కావాల్సినంత సమాచారం వైసీపీకి చేరవేసారు. దాన్ని జగన్ ఎలా వాడుకుంటాడు? గెలుస్తాడా లేదా అనేది వేరే విషయం. ఒక సమర్థుడి అహంకారం అసమర్థున్ని కూడా రాజును చేస్తుందని కేసీఆర్ ఇప్పటికే రుజువుచేసాడు.

ఒంటినిండా అవినీతి మకిలి పులుముకున్నదని ఆరోపణలెదుర్కుంటున్న కేసీఆర్ కుటుంబం, దాన్నుంచి ఎలా బయటపడతుందో ఎవరికీ తెలియదు. ఇప్పటికే ‘మద్యం’లో పీకలదాకా మునిగిపోయిన కవిత చాలక, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఒకటి. ఇది చాలా భయంకరమైన పరిస్థితులను సృష్టించబోతోంది. పోలీసులు విశ్వసనీయంగా చెబుతున్నదాని ప్రకారం, పెద్ద తలలే పెద్దయెత్తున ఇరుక్కున్నాయని సమాచారం. దుగ్యాల ప్రణీత్రావు అనే డిఎస్పి పెద్దల ఆదేశాలు, సహాయసహకారాలతోనే ఈ పని చేసినట్లు ఒప్పుకున్నాడని చెబుతున్నారు.

నిజమే.. ఈ ట్యాపింగ్ పరికరాలు, సాఫ్ట్వేర్ అంతా ఇజ్రాయెల్ నుండి కొనాలి. సర్వైలెన్స్కు సంబంధించి ఇజ్రాయెల్ సూపర్ పవర్. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న పెగాసస్ ఇజ్రాయెల్ కంపెనీనే. కాకపోతే అది కేవలం ప్రభుత్వాలకే ఆ వ్యవస్థను అమ్ముతుంది. ఇది పెగాసస్ కాకపోయినా, కావాల్సినంత పనైతే చేసి పెట్టగలదు. అయితే చాలా పెద్ద మొత్తం ఖర్చు పెట్టాల్సిఉంటుంది. ఇల్లీగల్గా చేసింది కాబట్టి, డార్క్వెబ్లో కొని ఉంటారు. ఇదంతా చేయాలంటే పెద్దల ఆర్థిక అండదండలు తప్పనిసరి.

ఇప్పుడు ఇది పూర్తిగా వ్యక్తిగతంగా కూడా మారింది. రేవంత్రెడ్డి ఇంటిపక్కనే ఓ సెటప్ పెట్టారని, ఆయనింట్లో జరిగిన మాటామంతీ అంతా విన్నారని తెలిసిన రేవంత్ ఎలా ఊరుకుంటాడు? ఆడుకోకుండా ఎలా ఉంటాడు? ఎవరి ఆదేశాలతో ఇదంతా జరిగిందన్నది అప్రస్తుతం కానీ, గత ప్రభుత్వపెద్దలకే చుట్టుకుంటుందన్నది మాత్రం వాస్తవం. ఇప్పటికే ఇందులో ఇరుక్కున పోలీసు పెద్దలు ‘నగ్న’సత్యాలన్నీ బయటపెట్టారని సమాచారం.

ఇక, మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కుంగిపోవడం, పగుళ్లు రావడమనేది ఒకవేళ ఇంజనీరింగ్ లోపమే అయినా, ప్రజలు దాన్ని నమ్మే పరిస్థితి లేదు. దానికి తోడు లిక్కర్ స్కాం, ఫోన్ ట్యాపింగ్, పునర్వైభవం పొందలేని స్థాయికి పార్టీని దిగజార్చాయి.ఇవి సరిపోలేదన్నట్లు ఇంకా ఈ అహంభావవు మాటలు. కేటీఆర్ కూడా సభ్యత మర్చిపోయి మాట్లాడుతున్నాడు. బహుశా ఆయనను ఫోన్ట్యాపింగ్ అంశం బాగా డిస్టర్బ్ చేసినట్లుంది. ఓడిపోయిన రెండు రోజులకే పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. కుటుంబసభ్యులను మనమే వెళ్లగొట్టగా, మధ్యలో వచ్చిన చుట్టాలు మధ్యలోనే వెళ్లిపోయారు.

ఇక మిగిలింది ప్రజలు. వాళ్లకు ఇప్పుడు బిఆర్ఎస్ అంటే చెప్పలేనంత విరక్తి ఉందని చెప్పకనే చెపుతున్నారు. ఇప్పుడప్పుడే జనాల్లో అధికార కాంగ్రెస్అంటే వ్యతిరేకత వచ్చే పరిస్థితి లేదు. అందుకే రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఎన్ని సీట్లు వస్తాయంటే అధినేతతో సహా ఎవరూ చెప్పలేని నిస్సహాయస్థితి. ఫలానా సీటు మనదే అన్న గ్యారెంటీ ఎవరికీ లేదు. కవిత అంశం సానుభూతి కంటే కీడే ఎక్కువ తెచ్చిపెట్టింది.

ఇక క్యూ కట్టి మరీ బయటకెళ్లున్న ఎమ్మెల్యేల, కాంగ్రెస్ మంత్రులు చెబుతున్నదాని ప్రకారం ఇంకా 25మంది వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అదే జరిగితే పెను ప్రమాదం తప్పదు. శివసేన సీన్ ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశముంది. పార్టీ మారకుండా, అసలైన బిఆర్ఎస్ మాదే అని మెజారిటీ ఎమ్మెల్యేలు క్లెయిమ్ చేస్తే, పార్టీ వారికే పోతుంది. కోర్టు కూడా వారికే అనుకూలంగా తీర్పుఇస్తుంది. అంటే ఉద్ధవ్కు జరిగిందే రేపు కేసీఆర్కు జరిగితే, పార్టీ, దాని ఆస్తిపాస్తులు, గుర్తు అన్నింటినీ కోల్పోవాల్సిఉంటుంది.

ఇటువంటి పరిస్థితుల్లో బిఆర్ఎస్ పూర్వవైభవాన్ని తిరిగి పొందగలదా?అంటే..ఆకాశం వైపు చూడాల్సిందే. ఎందుకంటే ఇక్కడ శత్రువులు బయటివారు కాదు. ఇంటివారే. అధికారం ఎవరికీ, ఎప్పటికీ శాశ్వతం కాదనే నిజాన్ని కేసీఆర్ ఉద్దేశ్యపూర్వకంగానే పక్కనబెట్టారు. దాంతో కేసీఆర్ను ఓడించాలంటే కేసీఆర్కే సాధ్యం అని గర్వంగా చెప్పుకున్న మాట ఇంకోరకంగా నిజమై కూర్చుంది.

వేల పుస్తకాలు చదివిన అపరచాణక్యుడికి అహంకారం అలంకారం కాదన్న సత్యం శోషించకపోవడం బాధాకరం. ఉద్యమంతో ఉవ్వెత్తున మొదలై, పార్టీగా మారి, రాష్ట్రాన్ని సాధించి, అధికారం చేపట్టి, చివరికి ఉనికినే ప్రశ్నార్థకం చేసుకున్న టిఆర్ఎస్ (కాదు.. బిఆర్ఎస్) అంటే ప్రస్తుతం ప్రజలకు ఉన్నది కేవలం జాలి మాత్రమే. స్వయంకృతాపరాధమే టిఆర్ఎస్ పాలిటి భస్మాసురహస్తంగా మారిందనేది కాదనలేని సత్యం.

–అధర్వ

Latest News