Site icon vidhaatha

Visakha Steel Factory: విశాఖ ఉక్కును.. సింగరేణి ఉద్ధరిస్తదా?

విధాత: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తామని కేంద్రం ప్రకటించినప్పటి నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఏపీలో అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం మినహా సమస్య పరిష్కారం కోసం ఏకతాటిపైకి రాలేకపోయాయి. ఇది మీ వైఫల్యం అంటే, మీ వైఫల్యమని నిందారోపణలకే పరిమితమయ్యాయి. అయితే తాజాగా విశాఖ ఉక్కు బిడ్‌లో తెలంగాణ ప్రభుత్వం సింగరేణి ద్వారా పాల్గొనేందుకు సిద్ధమైంది. దీంతో ఏపీ, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

అసలు సమస్యకు కారణమైన కేంద్రాన్ని వదిలి ఇరు రాష్ట్రాల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నదనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే విశాఖ బిడ్‌లో పాల్గొనడానికి పేపర్‌లో వచ్చిన ప్రకటనను గమనిస్తే.. ముడి పదార్థాల సరఫరా లేదా మూలధనం సమకూర్చేందుకు విశాఖ ఉక్కు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు ఆహ్వానించింది. దీనిపై ఏడు సంస్థలు మాత్రమే స్పందించాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం సింగరేణి ద్వారా బిడ్‌లో పాల్గొంటున్నా, ఆ సంస్థకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని చేజిక్కించునే సత్తా ఉన్నదా? అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతున్నది.

స్టీల్‌ను సింగరేణి ఏం చేసుకుంటుంది?

బిడ్‌లో పాల్గొనే వారు ముడిపదార్థాలు ఐరన్‌ ఓర్‌ లేదా, బొగ్గు సమకూరిస్తే విశాఖ ఉక్కు వారు దానికి ప్రతిఫలంగా స్టీల్‌ ఇస్తామని విశాఖ ఉక్కు సంస్థ పేర్కొన్నది. దాన్ని అమ్ముకోవడం ద్వారా లేదా రాష్ట్ర అవసరాలకు వినియోగించుకోవడం ద్వారా సొమ్ము చేసుకోవచ్చు. కానీ ఆ స్టీల్‌ను సింగరేణి సంస్థ ఏం చేస్తుందనేది అసలు ప్రశ్న ఇప్పుడు ముందుకు వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో గతంలో వలె భారీ ప్రాజెక్టుల నిర్మాణాలేవీ జరగడం లేదు.

సింగరేణి ప్రతిపాదించిన 800 మెగావాట్ల థర్మల్‌ కేంద్ర నిర్మాణానికి ఈ స్టీల్‌ వాడుకోవచ్చని చెబుతున్నారు. అయితే కార్మికులు, అధికార వర్గాలు అందించిన వివరాలు.. అధికారిక బాలెన్స్‌ షీట్‌ను పరిశీలిస్తే సింగరేణి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. సింగరేణి సిరులవేణి అన్నది ఒకప్పటి మాట. పన్నుల భారం తగ్గించుకోవడానికి లాభాలు తక్కువగా చూపెట్టి, ఆ నిధులను సింగరేణి విస్తరణకు ఉపయోగించిన రోజులు ఉన్నాయి.

ప్రస్తుతం ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో బొగ్గు నిల్వలన్నీ తవ్విన తర్వాత ఆ భారీ గోతులను తిరిగి పూడ్చివేయాలి. ఈ షరతులకు లోబడే ఓపెన్‌ కాస్టులకు అనుమతి ఇస్తారు. ఈ గోతులను పూడ్చేందుకు సింగరేణి వద్ద రూ. 4 వేల కోట్ల రిజర్వు నిధులు ఉండేవి. ఈ మొత్తంతో బాండ్లను కొనుగోలు చేసి, వడ్డీ ద్వారా ఆదాయం పొందేవాళ్లు.

తొమ్మిదేళ్ల కాలంలో ఆ నిధులన్నీ ఆవిరయ్యాయి. వాటిలో కొంతమొత్తాన్ని జైపూర్‌ పవర్‌ ప్లాంట్‌లో ఖర్చుపెట్టగా.. మిగిలిన నిధులన్నీ మాయమయ్యాయి. ప్రస్తుతం కొన్నిసార్లు నెలనెల ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే అప్పు చూపాల్సిన పరిస్థితి నెలకొన్నది. అంతెందుకు తమ ఒడిలోనే వేలం వేస్తున్న గనులను కూడా కొనలేని పరిస్థితిలో సింగరేణి ఉన్నది. సింగరేణి ఆర్థిక పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేని ఈ స్థితితో విశాఖ ఉక్కు ఈవోఐలో పాల్గొనడం కోరి కష్టాలు తెచ్చుకోవడమే అవుతుందని సింగరేణి కార్మిక సంఘం నేతలు విమర్శిస్తున్నారు.

అసలు కేంద్రం ఆమోదిస్తుందా?

మరోవైపు సింగరేణిలో తెలంగాణ వాటా 51 శాతం, కేంద్రం వాటా 49 శాతం. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో ఆమోదం తప్పనిసరి. విశాఖ ఉక్కును విక్రయించాలనే విధానానికి భిన్నంగా సింగరేణి తీసుకునే నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించే అవకాశం ఏమాత్రం లేదు. అయితే 11 మంది డైరెక్టర్లలో కేంద్రానికి చెందిన వారు ముగ్గురే.

కాబ్టి వారి అభ్యంతరాలకు విలువ ఉండదు కాబట్టి ఇబ్బంది లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉండొచ్చు, అయితే భవిష్యత్తులో సింగరేణికి కేంద్రం నుంచి అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఈ అసలు విషయాన్ని దాచి తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ సహా తామేదో ఏపీ ప్రజలను, ముఖ్యంగా విశాఖ ఉక్కు పరిశ్రమను తామే కాపాడుకుంటామన్నంత ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉన్నది.

రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఈ బిడ్‌లో సింగరేణి పాల్గొనడం లేదని ఆయన అంటున్నా.. అసలు సింగరేణి ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై ఒక శ్వేత పత్రం విడుదల చేసే స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నదా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్న వాళ్లు ఉన్నారు. కాబట్టి కొండినాలుకకు మందేస్తే.. అన్న చందంగా ఇది సింగరేణిని ముంచే నిర్ణయమని విమర్శలు వస్తున్నాయి.

Exit mobile version