Assam | ఓ ఎనిమిది మంది కామాంధులు చెలరేగిపోయారు. మాటలు రాని మహిళతో పాటు ఆమె కూతురిపై క్రూర మృగాల్లా విరుచుకుపడ్డారు. గంటల తరబడి తల్లీకూతుళ్లను హింసించారు. ఈ దారుణ ఘటన అసోంలోని గువాహటిలోని సత్‌గావ్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సత్‌గావ్‌లో ఓ మూగ మహిళ తన కుమార్తెతో కలిసి ఉంటోంది. అయితే మే 17వ తేదీ రాత్రి సత్‌గావ్‌కు చెందిన అమిత్ ప్రధాన్, అతడి సహచరులు కలిసి.. బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించారు. అరవకుండా వారి నోట్లో బట్ట ముక్కలు కుక్కారు.
ఆ తర్వాత సామూహికంగా లైంగికదాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా తల్లీకూతుళ్ల ప్రయివేటు భాగాల్లో కారం పొడి చల్లి హింసించారు. దీంతో ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. అపస్మారక స్థితిలో ఉన్న తల్లీకూతుళ్లను చికిత్స నిమిత్తం గువాహటి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. నిందితుల్లో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.