Yadadri Bhuvanagiri | ఔటర్ పై న్యాయ పోరాటం చేస్తాం: భట్టి విక్రమార్క

Yadadri Bhuvanagiri విధాత: ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్ అవినీతిపై కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటాన్ని ప్రారంభిస్తుందని, రాష్ట్రపతికి కూడా దీనిపై లేఖ రాస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆయన పీపుల్స్ మార్చ్ పాదయాత్రను కొనసాగించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజల అనంతరం యాదగిరిగుట్ట నుండి భువనగిరి నియోజకవర్గం బస్వాపురం రిజర్వాయర్ వద్దకు పాదయాత్ర కొనసాగించారు. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులతో మాట్లాడి వారి […]

  • Publish Date - May 3, 2023 / 02:27 PM IST

Yadadri Bhuvanagiri

విధాత: ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్ అవినీతిపై కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటాన్ని ప్రారంభిస్తుందని, రాష్ట్రపతికి కూడా దీనిపై లేఖ రాస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆయన పీపుల్స్ మార్చ్ పాదయాత్రను కొనసాగించారు.

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజల అనంతరం యాదగిరిగుట్ట నుండి భువనగిరి నియోజకవర్గం బస్వాపురం రిజర్వాయర్ వద్దకు పాదయాత్ర కొనసాగించారు. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాలేదన్న ఆందోళనతో ప్రభుత్వ ఆస్తులను, పన్నులను ప్రైవేట్ పరం చేసి వేల కోట్ల రూపాయలు దండుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం నుండి నాలుగైదు నెలలు పాటు ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రజల మీద ఉందన్నారు.

ఔటర్ రింగ్ రోడ్డు టోల్ వసూల్ టెండర్ అప్పగించిన తీరు చూస్తే రాష్ట్రంలో వసూలు చేసిన పన్నుల వసూలు, ఆస్తులను అంబానీ, ఆదానీలకు అప్పగించి ఆ డబ్బంతా ఇప్పుడే తనకి కట్టెయ్యమని చెప్పేలా కేసీఆర్ వ్యవహారం ఉందన్నారు. ఆంధ్ర పాలకులు తెలంగాణ వనరులను దోచుకుంటున్నారని చెప్పి, కొట్లాడి బలిదానాలతో తెలంగాణ తెచ్చుకుంటే సీఎం కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఆస్తులను దోచుకుంటుందన్నారు.

రాష్ట్రంలో దోచుకోవడం చాలక పక్క రాష్ట్రాలకు వెళ్లి రాజకీయాలు, వ్యాపారాలు చేస్తూ, అక్కడి ఎన్నికల్లో ఇక్కడ దోచుకున్న డబ్బును విచ్చలవిడిగా వెదజల్లుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి వ్యవహారాలు బయటపడతాయాన్న ఉద్దేశంతోనే ఆర్టిఐ చట్టాన్ని నీరు గారుస్తుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన 2013 భూ సేకరణ చట్టాన్ని అనుసరించి బస్వాపురం నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా భూములతో, ఊర్లో ఉన్న అనుబంధాలను వదిలి నిర్వాసితులుగా మారుతున్న ప్రజలకి తగిన పరిహారము, పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.

సీఎం కేసీఆర్ స్వయంగా గతంలో అసెంబ్లీ సాక్షిగా భూముల వాస్తవ ధరకు మూడు రేట్లు అధికంగా పరిహారం చెల్లించాలని చెప్పారని, మరి ఆయన ఇప్పుడు ఎందుకు చెల్లించడం లేదని నిలదీశారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో తొమ్మిదిన్నర ఏళ్ళ రాష్ట్ర బడ్జెట్ నిధులు, అప్పులు చేసిన ఐదు లక్షల కోట్ల నిధులు దుర్వినియోగమై ప్రభుత్వ పెద్దల అవినీతి పాలయ్యాయన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వేల కోట్ల డబ్బును వృథా చేశారని, కొత్తగా ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయారన్నారు. రిజర్వాయర్లు నిర్మించి ప్రచారం చేసుకోవడం మినహా కాలువలు, డిస్ట్రిబ్యూటర్లు తవ్వక కొత్తగా నీళ్లు ఎక్కడ ఇచ్చారో చెప్పాలన్నారు. రాష్ట్ర సచివాలయం అప్పుడే చిన్న వర్షాలకు కురుస్తున్న తీరు ప్రభుత్వ అసమర్ధ పనితీరును చాటుతుందన్నారు.

సీఎం కెసిఆర్ ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత ప్రచారం కోసమే ప్రగతిభవన్ సచివాలయాలు నిర్మించారన్నారు. ధాన్యం కొనుగోలు జాప్యంతో వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో విఫలమైందన్నారు. ఛత్తీస్ ఘడ్ తరహాలో ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ బిఆర్ఎస్ లు ఒకటేనంటూ బిజెపి దుష్ప్రచారం చేస్తుందని, వాస్తవానికి ఆ రెండు పార్టీలు పరస్పరం లోపాయికారి రాజకీయాలతో కాంగ్రెస్ ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.

కేసీఆర్ కుటుంబం తెలంగాణను ఏటీఎంగా మార్చుకున్నదని, కాళేశ్వరం ప్రాజెక్టుతో నిధుల దోపిడీ చేసిందని, అనేక అవినీతి అక్రమాలు చేస్తుందని ఆరోపించిన బిజెపి ప్రభుత్వం ఎందుకు కేసీఆర్ కుటుంబం పై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అవినీతి నియంతృత్వ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఓట్ల ఉద్యమం రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ప్రజా ప్రభుత్వ స్థాపన ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సిరిసిల్ల రాజయ్య, కుడుదుల నగేష్, బండ్రు శోభారాణి, బీర్ల ఐలయ్య యాదవ్, ప్రమోద్ కుమార్, తంగళ్ళపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Latest News