- అమ్ల వర్షాలతో తగ్గనున్న దిగుబడులు
- మానవుల్లో సంతానోత్పత్తి సమస్యలు
- కాలుష్య కారకం థర్మల్ పవర్ ప్లాంట్
- అభివృద్ధి ముసుగులో పర్యావరణ విధ్వంసం
- అడ్డదారి అనుమతులతో ప్లాంట్ నిర్మాణం
- పరిసర ప్రాంత ప్రజలకు ఆరోగ్య సమస్యలు
- వన్యప్రాణులకూ పొంచి ఉన్న ముప్పు
- ఈఐఏ నివేదికలో లోపాలపై ఆందోళన
- 20న మూడోసారి ప్రజాభిప్రాయ సేకరణ
విధాత, హైదరాబాద్: తెలంగాణ వెలుగు దివ్వెగా బీఆరెస్ ప్రభుత్వం అభివర్ణిస్తూ కోల్‌బెల్ట్ ఏరియాకు దూరంగా నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం ఈ ప్రాంత ప్రజలకు మేలుకంటే పర్యావరణపరంగా కీడు ఎక్కువగా చేస్తుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లాంట్ ద్వారా వెలువడే కర్బన ఉద్గారాలతో కురిసే ఆమ్ల వర్షాలు ఆ ప్రాంతంలో పంటలను నాశనం చేస్తాయని, ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ఎక్కువగా పండించే వరి పంటకు ఉరి వేసినట్టే అవుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో నివసించే మనుషుల ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తుందని, సంతానోత్పత్తి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.
కాలుష్య నియంత్రణ టెక్నాలజీ లోపం.. ప్రజలకు శాపం
థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటులో కాలుష్యాన్ని తగ్గించాలని 2017లో కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ మోతాదు తగ్గించేందుకు రెండు యూనిట్ల ఎఫ్‌జీడీలు నిర్మించాలి. యాదాద్రి ఫ్లాంట్‌లో అవిరి బయటకు పంపించే పొగ గొట్టం దగ్గర మండించే వాయువులు బయటకు పంపించేందుకు 275 మీటర్ల ఎత్తయిన పొగ గొట్టాలు కట్టారు. వాయువులను శుద్ధి చేసే యూనిట్లకు కేంద్రం పేర్కొన్న టెక్నాలజీ లేకపోవడంతో గొట్టాల ద్వారా నేరుగా అవిరి గాలిలో కలిసే ప్రమాదం నెలకొంది. దీని వల్ల ప్లాంటు పరిసరాల గ్రామాలపైన, అడవులపైన ఆమ్ల వర్షాలు కురిసే ప్రమాదముందని పర్యావరణవేత్త బాబూరావు హెచ్చరించారు. సదరు ఆమ్ల వర్షాలతో ఆ ప్లాంట్ భాగాలు సైతం తుప్పు పట్టే అవకాశం ఉందని చెప్పారు. అలాగే సల్ఫర్ ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ విడుదలతో వాయుకాలుష్యం, జలకాలుష్యం, భూ క్షీణత ఏర్పడి వన్యప్రాణులకు, పంటలకు, మనుషులకు ప్రమాదకరంగా పరిణమిస్తుందని హెచ్చరించారు.
20న మూడో విడుత ప్రజాభిప్రాయ సేకరణ
సూపర్ క్రిటికల్ అల్ట్రా టెక్నాలజీతో రూ.29,965 కోట్ల వ్యయంతో చేపట్టిన 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ ప్లాంట్‌పై తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఫిబ్రవరి 20న ఉదయం 11 గంటలకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్టు పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. అయితే.. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు సంబంధించిన ముసాయిదా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఈఐఏ) నివేదికలో తీవ్ర లోపాల నేపథ్యంలో ఈ నెల 20న జరిగే ప్రజాభిప్రాయ సేకరణ కీలకంగా మారింది.
ఎన్జీటీలో కేసులతో పర్యావరణ సమస్యలు బహిర్గతం
యాదాద్రి ప్లాంటుకు పర్యావరణ అనుమతి ఇవ్వడం తగదంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో వైజాగ్‌కు చెందిన సమతతోపాటు, ముంబైకి చెందిన కన్సర్వేషన్ యాక్షన్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ కేసు వేశాయి. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ.. యాదాద్రి ప్లాంటు నిర్మాణం వల్ల ఆ ప్రాంతంలో పర్యావరణంపై పడే ప్రభావంపై అధ్యయనం కోసం వెంటనే టీవోఆర్ జారీ చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను గత ఏడాది అక్టోబర్‌లో ఆదేశించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖలు మరోసారి ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమయ్యాయి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు 2,100 ఎకరాల అటవీ భూముల్లో నిర్మించారు. రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ జోన్ సమీపంలో, కృష్ణా నది చెంతన దీన్ని నిర్మించారు.
అసలు అక్కడ ఎలా అనుమతి ఇచ్చారు? పర్యావరణ సమస్యలను పరిగణలోకి తీసుకోలేదంటూ ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్)కి ఫిర్యాదు చేశారు. అటవీ శాఖ నుంచి తీసుకున్న భూములకు ప్రత్యామ్నాయంగా ఇచ్చిన భూములు కూడా డిండి ఎత్తిపోతలలో భాగమైన ముంపు భూములు కావడం గమనార్హం. ఆ భూమి అడవులకు పనికే రావన్న అంశం మరో సమస్యగా తయారైంది. అయితే.. మూడోసారి జరిగే ప్రజాభిప్రాయ సేకరణపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. థర్మల్ ప్లాంట్ నిర్మాణంతో ఎదురయ్యే పర్యావరణ ప్రభావిత నివేదికను ప్రజలు చదవకుండా కాలుష్య నియంత్రణ మండలి తొలుత బహిర్గతం చేయలేదు. దీనిపై ప్రముఖ పర్యావరణ వేత్త బాబురావు ఫిర్యాదు చేయడంతో ప్రజాభిప్రాయా సేకరణకు రెండు వారాల ముందు వెబ్సైట్లో పెట్టారు.
అది కూడా 829 పేజీల ఆంగ్ల నివేదికను మూడు భాగాలుగా పెట్టారు. తెలుగులో లేకపోవడంతో స్థానిక ప్రజలకు అది అర్థమయ్యే అవకాశం కూడా లేదని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ముందుగా ఆ నివేదికను ప్రజల్లో చర్చకు పెట్టకపోవడం, గ్రామసభల ద్వారా అవగాహన కల్పించకపోవడం వంటివేవీ లేకుండానే మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ తంతు ముగించి అనుమతుల కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పర్యావరణ ప్రభావితా అంశాలలో ప్రధానంగా బొగ్గు విద్యుత్ ప్లాంట్ నుండి గాలిలోకి విడుదలయ్యే అనేక వాయు కాలుష్య కారకాలు ఉన్నాయి. వీటిలో సల్ఫర్ డయాక్సైడ్(ఎస్వో), కార్బన్ మోనాక్సైడ్ (సీవో), నైట్రోజన్ ఆక్సైడ్లు (ఎన్వోఎక్స్) , ఓజోన్ (వో) ఉన్నాయి. సస్పెండ్ పర్టిక్యులేట్ మేటర్ (ఎస్పీఎం), సీసం, నాన్మీథేన్ హైడ్రోకార్బన్ కూడా విడుదలవుతాయి. ఉష్ణోగ్రతలు సైతం రెట్టింపవుతాయి. సల్ఫర్ డయాక్సైడ్ (ఎస్వో) అనేది బొగ్గు ఆధారిత విద్యుత్తు ప్లాంట్ల నుండి వచ్చే ఒక సాధారణ కాలుష్యం. కొన్నిసార్లు అధిక ఆక్సిజన్ కారణంగా ఎస్వో కూడా ఏర్పడుతుంది. ఇది వాతావరణంలోని తేమతో కలిసిపోతుంది. ఆమ్లవర్షాన్ని కలిగిస్తుంది.
బొగ్గు ఆధారిత విద్యుత్తు ప్లాంట్ల నుండి వచ్చే ఎస్పీఎం ప్రధానంగా మసి, పొగ, చిక్కటి ధూళి కణాలు.. ఆస్తమా, శ్వాసకోశ, ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతాయి. చర్మ, కంటి దురద, గుండె జబ్బులనూ కల్గిస్తాయి. అలాగే బొగ్గు పవర్ ప్లాంట్‌లో నీటిని బొగ్గును కడగడానికి ఉపయోగిస్తారు. బాయిలర్ ఫర్నేస్‌లో తిరుగుతూ ఆవిరిని ఉత్పత్తి చేయడానికి పరికరాలను శీతలీకరించడానికి ఉపయోగిస్తారు. బొగ్గుతో శుద్ధి చేసిన నీటి దుమ్ము భూగర్భ జలాలను కలుషితం చేస్తుంది. వేడి నీటిని చల్లబరచకుండా జల వనరులలోకి వదిలేస్తే, వాటి ఉష్ణోగ్రత పెరుగుతుంది. తద్వారా జల, వృక్షజాలం, జంతుజాలం మీద ప్రభావం చూపుతుందంటున్నారు పర్యావరణ వేత్తలు. జీవరాశుల్లో, పశువులు, మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలను కూడా కల్గిస్తాయని గతంలోని పరిశోధన నివేదికలు చాటుతున్నాంటున్నారు. మరోవైపు బొగ్గు విద్యుత్తు ప్లాంట్ల నుండి శుద్ధి చేయని గాలి, నీటి కాలుష్య కారకాలు నీటి వనరులను, ప్రక్కనే ఉన్న ప్రాంతాలలోని వృక్షజాలం, జంతుజాలంపై ప్రభావం చూపుతాయని, వాటిని జీవన లేదా జీవనోపాధి కార్యకలాపాలకు అనర్హులుగా చేస్తాయంటున్నారు. అదీగాక బాయిలర్లు, టర్బైన్లు, క్రషర్లు వంటి పరికరాల వినియోగంతో పవర్ ప్లాంట్ల నుండి వెలువడే అధిక శబ్ద స్థాయిలు ప్లాంట్లలో పనిచేసే వ్యక్తులపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.
ప్రమాదమని తెలిసినా ప్లాంట్ల నిర్మాణాలు
థర్మల్ విద్యుత్తు ప్లాంట్లతో వెలువడే కాలుష్యం వాయు, జల, భూ, శబ్ద కాలుష్యాలకు కారణమవుతుందని తెలిసినా ప్రజాసంక్షేమం కంటే ప్లాంట్ల నిర్మాణమే లక్ష్యంగా తప్పుడు నివేదికలతో అనుమతులు సాధిస్తున్నారనేది పర్యావరణ వేత్తల వాదన. 2017లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వారు పవర్ ప్లాంట్స్ నుంచి నిపుణులను, బీహెచ్ఎఈఎల్ నుంచి ఒకరిని, ఇతర రంగాల నిపుణలతో కమిటీ కమిటీ ఏర్పాటు చేశారు. కొత్తగా ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్‌జీడీ) ప్లాంట్ పెట్టినప్పుడు ఎలాంటి మార్పులు పాటించాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? అనే అంశాలు రూపొందించారు. కానీ యాదాద్రి ప్లాంట్‌లో అలాంటిది పెట్టలేదు. ఇన్నేళ్లయినా కమిటీ సూచనలను పట్టించుకోలేదు. పర్యావరణ నిబంధనల్లో ఎఫ్జేడీ పెట్టాలని నిర్దేశిస్తూనే.. 275 మీటర్ల గొట్టాలు నిర్మించవచ్చని గందరగోళ నిబంధనలు పొందుపరుచడంతో వాటి మాటున కాలుష్య నివారణ చర్యలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2017 తర్వాత రామగుండెంలో 800 చొప్పున రెండు యూనిట్లు, విజయవాడ, కృష్ణపట్నంలో, ఇబ్రహీంపట్నంలో కట్టిన ఫ్లాంట్లలోనూ 275 మీటర్ల గొట్టాలనే నిర్మించడం గమనార్హం.
150 మీటర్ల వరకే నిర్మించాల్సిన అవిరి గొట్టాలు.. 275 వరకు నిర్మించేసి, వాతావరణ కాలుష్యం తక్కువ వచ్చిందని చెబుతు మోసం చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఇప్పటికే నడుస్తున్న థర్మల్ పవర్ ప్లాంట్లు వెదజల్లే వాతావరణ కాలుష్యంతో వాటి చుట్టుపక్కల ఏటా 12వేల మంది ప్రజలు ఆయు ప్రమాణాల కంటే ముందే ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ లెక్కన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కాలుష్యంతో ఏటా 2వేల మంది ప్రాణాలకు ప్రమాదం ఏర్పడవచ్చని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. పంట దిగుబడి తగ్గిపోవడం, జీవోత్పత్తి సామర్థ్యాలు పడిపోవడం జరుగుతుందని ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయని వారు ప్రస్తావిస్తున్నారు.