YCP MLC Zakia Khanam: వైసీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి షాక్ ఇచ్చిన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం బుధవారం బీజేపీలో చేరారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీ సమక్షంలో బీజేపీలో చేరారు. జకియా ఖానంకు పురందేశ్వరీ పార్టీ కండువా కప్పి బీజేపీలోని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జకియా ఖానం మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల నుంచి మంచి సందేశమిచ్చేందుకే తాను బీజేపీలో చేరినట్లుగా తెలిపారు. ప్రధాని మోదీ దేశంలోని అందరికి సమాన హక్కులు అమలు చేస్తున్నారని..ముఖ్యంగా ముస్లిం మహిళలకు భరోసానిచ్చిన ఏకైక ప్రధాని మోదీ అని జకియా ఖానం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వై.సత్యకుమార్ యాదవ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి వైసీపీకి ఆరుగురు ఎమ్మెల్సీలు గుడ్ బై కొట్టారు. వారిలో జయమంగళ వెంకటరమణ, మర్రి రాజశేఖర్, బల్లి కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జకియా ఖానంలు ఉన్నారు. వైసీపీ 2020లో జకియా ఖానంను గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. అప్పటి నుంచి ఆమె మండలి డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనంతరం జకియా ఖానం పార్టీకి దూరంగా ఉంటున్నారు. టీడీపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసిన సందర్భంలో ఆమె పార్టీ మారుతారని భావించారు. అయితే అనూహ్యంగా బీజేపీలో చేరారు.