Site icon vidhaatha

ఏపీ కాంగ్రెస్ చలో సెక్రటెరియట్ భగ్నం.. వైఎస్ షర్మిల అరెస్టు

అన్న పాలనపై నిప్పులు చెరిగిన చెల్లెలు

విధాత : ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో గురువారం చేపట్టిన చలో సెక్రటెరియట్ కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడే భగ్నం చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. పలుచోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించారు.

అనంతరం అమరావతి కరకట్టపై భారీగా మోహరించిన పోలీసులు తొలుత కార్యకర్తలు, నాయకులను బలవంతంగా వాహనాల్లో తరలించారు. పార్టీ నాయకులు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. కొండవీటి ఎత్తిపోతల దగ్గర షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల కారు దిగగానే చుట్టుముట్టి బలవంతంగా అరెస్టు చేసి పోలీసు వాహనం ఎక్కించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట కొంత ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం డౌన్ డౌన్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. షర్మిలతో పాటు కార్యకర్తలను, నాయకులను దుగ్గిరాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

హామీలపై ప్రశ్నిస్తే అణిచివేతనా

చలో సెక్రటెరియట్ కార్యక్రమాన్ని భగ్నం చేయడంతో ఆగ్రహించిన వైఎస్ షర్మిల పోలీసుల తీరును, ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని అడిగితే పోలీసులు ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. 23 లక్షల జాబ్స్ ఇస్తామని జగన్ అధికారంలోకి వచ్చారని, 25 వేల టీచర్ పోస్టుల ఖాళీలు ఉంటే కేవలం 6 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారని, మొత్తం ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆందోళన చేపడితే అణిచివేత ద్వారా ప్రభుత్వం తన వైఫల్యాన్ని అంగీకరించిందన్నారు. వైసీపీ పార్టీ గతంలో చంద్రబాబునాయుడును 25వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే 7వేల ఉద్యోగాలూ ఇవ్వలేదని అడగలేదా? ఆ మాటలు ఇవాళ మీకు వర్తించవా? అని నిలదీశారు. మెగా డీఎస్సీ కాకుండా దగా డీఎస్సీ ఇచ్చారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్‌ ఏమైందని నిలదీశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికి నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వడం లేదని విమర్శించారు.


వైఎస్ వారసత్వం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు షర్మిల క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళ అని కూడా చూడకుండా తనను రాత్రి సమయంలో పోలీసు స్టేషన్‌లో ఉంచారని విరుచుకుపడ్డారు. పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో తన చేతికి గాయమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు తన పరిస్థితిని చూసి తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌‌రెడ్డి ఆత్మ క్షోబిస్తుందని.. తన తల్లి ఎంతో బాధపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో వినతి పత్రం ఇద్దామని వస్తే ఎవ్వరూ అందుబాటులో లేని పరిస్థితి ఉందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు సచివాలయానికి ఎందుకు రారని ప్రశ్నించారు. చివరకు సీఎస్ కూడా సచివాలయంలో ఉండరన్నారు. ప్రజా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని నిలదీశారు. ఏపీలో అసలు పరిపాలన లేదన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కాపాడట్లేదని మండిపడ్డారు. పోలవరం ఇంకా పూర్తి చేయలేకపోయారని చెప్పారు. రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదని షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version