రోజూ.. ఇన్ని మెట్లు ఎక్కితే గుండె పోటు దూరం

  • Publish Date - September 30, 2023 / 10:00 AM IST

విధాత‌: మారిన జీవన‌శైలి (Life Style) వ‌ల్ల ఇటీవ‌లి కాలంలో యువ‌త కూడా గుండెపోటు బారిన ప‌డుతున్న విష‌యం తెలిసిందే. అందులో ప్ర‌ధానంగా అపార్ట్‌మెంట్ల‌లోనూ, ఆఫీసుల్లోనూ మెట్లు ఉప‌యోగించ‌కుండా ఎలివేట‌ర్ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. అయితే రోజూ క‌నీసంలో క‌నీసం 50 మెట్ల‌ను ఎక్కితే గుండెపోటు ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకునే అవ‌కాశాలున్నాయ‌ని ఒక అధ్య‌యనంలో వెల్ల‌డ‌యింది.



అథెరోసెలోరిసిస్ జ‌ర్న‌ల్లో ప్ర‌చురిత‌మైన ఈ ప‌రిశోధ‌నా ప‌త్రం ప్ర‌కారం.. రోజుకు క‌నీసం 50 మెట్లు (Climbing Stairs) ఎక్కితే గ‌నుక గుండెపోటు, గుండె ద‌డ‌, హార్ట్ స్ట్రోక్ (Heart Strokes) వ‌చ్చే అవ‌కాశాలు 20 శాతం మేర త‌గ్గే అవ‌కాశ‌ముంది. గుండె సామ‌ర్థ్యాన్ని, బ‌లాన్ని పెంచుకోవ‌డానికి చ‌వకైన‌, సుర‌క్షిత‌మైన మార్గం మెట్లు ఎక్క‌డ‌మేన‌ని ప‌రిశోధ‌న‌కు నేతృత్వం వ‌హించిన డా.లు షి పేర్కొన్నారు. గుండె అనే కాకుండామోకాళ్ల ప‌టుత్వానికి కూడా ఈ చిట్కా ఉప‌యోగప‌డుతుంద‌ని తెలిపారు.



ఈ అధ్య‌య‌నంలో ఇలాంటి అభిప్రాయానికి రావ‌డానికి ప‌రిశోధ‌కులు సుమారు 12.5 సంవ‌త్స‌రాల పాటు డేటాను సేక‌రించారు. ఈ కాలంలో వారు యూకే బ‌యోబ్యాంక్‌తో ఒప్పందం చేసుకుని సుమారు 4,58,000 వ్య‌క్తుల ఆరోగ్య స‌మాచారాన్ని సేక‌రించి విశ్లేషించారు. ఇందులో గుండె స‌మ‌స్య‌ల నుంచి త‌ప్పించుకున్న వారిని గుర్తించి కార‌ణాల‌ను పొందుప‌రిచారు. అందులో కుటుంబ చ‌రిత్ర, జీవ‌న‌శైలిల‌తో పాటు అంద‌రిలోనూ ఉమ్మ‌డిగా ఉన్న అంశం మెట్లు ఎక్క‌డం.



దీంతో ప‌రిశోధ‌కులు ఈ అంశంపై మ‌రింత లోతుగా ఆలోచించారు. ఇందులో భాగంగా మెట్లు ఎక్కే వ్య‌క్తుల వివరాల‌ను రాసుకుని వారి ఆరోగ్య స్థితిని కొన్నేళ్ల పాటు ట్రాక్ చేశారు. 12.5 సుదీర్ఘ అధ్య‌య‌నం అనంత‌రం క‌నీసం రోజూ 50 మెట్లు ఎక్కితే గుండె పోటు వ‌చ్చే ప్ర‌మాదం 20 శాతం మేర తగ్గుతుంద‌ని తేల్చారు.



స‌మాంతర ప్ర‌దేశంపై న‌డ‌వ‌డం కంటే మెట్లు ఎక్క‌డం అనేది ఎన్నో రెట్లు ఎక్కువ‌గా మేలు చేస్తుంద‌ని వ్యాయామ నిపుణులు ఎప్ప‌టి నుంచో చెబుతున్నారు. ‘మెట్లు ఎక్కేట‌ప్పుడు మ‌న‌లో చాలా కండ‌రాలు ప‌ని చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా శ‌రీరం బ్యాలెన్స్ అవుతూ న‌డ‌వాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల మెద‌డు, నాడీ వ్య‌వస్థల మ‌ధ్య స‌మ‌న్వ‌యం మెరుగుప‌డుతుంది’ అని ఇంగ్లాండ్‌లోని టెస్సీడే యూనివ‌ర్సిటీ స్పోర్ట్స్ నిపుణుడు డా.నికోల‌స్ బెర్జ‌ర్ వెల్ల‌డించారు.



ఈ క్ర‌మంలో గుండె తీసుకునే ఆక్సిజ‌న్ ప‌రిమాణం కూడా పెరుగుతుంది కాబ‌ట్టి.. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే మోకాళ్ల నొప్పులు ఉన్న‌వారు, వ‌యసు పైబ‌డిన వారు వైద్యుల స‌ల‌హాల‌ను అనుస‌రించాల‌ని నికోల‌స్ సూచించారు.

Latest News