ప్రస్తుతం చాలా మంది గుండెపోటు, పక్షవాతం భారీన పడి తమ ప్రాణాలను కోల్పోతున్నారు. మరీ ముఖ్యంగా హార్ట్ ఎటాక్ వల్ల చిన్నా పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది మరణిస్తున్నారు. ఇది కొవిడ్ తరువాత మరింత పెరిగింది. కారణాలు ఏవైనా గుండెపోటు తో పాటు పక్షవాతంతో ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమిళ్లింది. వీటి ముప్పును తగ్గించుకోవాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా పలు ఇన్‌ఫెక్షన్ జబ్బుల నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్లూ, కొవిడ్ వంటి ఇన్ ఫెక్షన్ల బారినపడిన కొన్ని వారాలా తరువాత హార్ట్ ఎటాక్, పెరాలసిస్ రిస్క్ గణనీయంగా పెరుగుతున్నట్లు జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రచురించిన అధ్యయనం హెచ్చరించింది.
హెచ్‌పీవీ, హెపటైటిస్ బీ వంటి వైరస్‌లు క్యాన్సర్‌కు కారణమయ్యే విషయం తెలిసిందే. కానీ ఫ్లూ, కొవిడ్, హెచ్ఐవి, షింగెల్స్ వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లు గుండె జబ్బులు, పక్షవాతం ముప్పులకూ కారణమవుతాయా? అనే అంశంపై చాలా తక్కువగా సమాచారం ఉంది. ఈ మధ్యే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు దాదాపు 52,000 పైగా ప్రచురిత అధ్యయనాలను విశ్లేషించి కీలక అంశాలను గుర్తించారు. అధ్యయన ఫలితాల ప్రకారం, ఫ్లూ వచ్చిన వ్యక్తులకు తర్వాతి నెలలో గుండెపోటు ముప్పు 4 రెట్లు, పక్షవాతం ముప్పు 5 రెట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో వెల్లడైంది. కొవిడ్ తర్వాత మొదటి 14 వారాల్లో హార్ట్ ఎటాక్, పక్షవాతం ముప్పులు 3 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ ముప్పులు ఏడాది పాటు ఉండే అవకాశం ఉంటుంది.
వైరల్ ఇన్‌ఫెక్షన్ల భారిన పడిన సమయంలో రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనలో వాపు (ఇన్‌ఫ్లమేషన్) ప్రేరిపితం చెందుతుంది. ఇది రక్తంలో గడ్డలు ఏర్పడే ప్రక్రియను పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్ తగ్గిన తరువాత కూడా వాపు, రక్తం గడ్డలు ఏర్పడడం కొనసాగుతాయి. వీటి ప్రభావంతో గుండె సామర్థ్యం తగ్గి గుండెపోటు, పక్షవాతం ముప్పులు పెరిగే అవకాం ఎక్కువగా ఉంటుంది. హెచ్ఐవీ ఉన్నవారిలో గుండెపోటు ముప్పు 60 శాతం, పక్షవాతం ముప్పు 40శాతం ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. అలాగే, హెపటైటిస్ సి ఉన్నవారిలో హార్ట్ ఎటాక్ రిస్క్ 27శాతం, పక్షవాతం ముప్పు 23 శాతం ఎక్కువగా ఉంటుంది. షింగెల్స్ (సర్పి) ఉన్నవారిలో గుండెపోటు ముప్పు 12శాతం, పక్షవాతం ముప్పు 18శాతం అధికంగా ఉంటుంది.
టీకాలు తీసుకోవడవం వల్ల గుండెను కాపాడుకోవచ్చు.. ఫ్లూ, కొవిడ్, షింగెల్స్ టీకాలు తీసుకోవడం వల్ల గుండెపోటు, పక్షవాతం ముప్పులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, ఫ్లూ టీకా తీసుకున్నవారిలో జబ్బుల ముప్పు 34శాతం తక్కువగా ఉండడం పరిశోధనలో వెల్లడైంది. వైరల్ ఇన్‌ఫెక్షన్ల నివారణ మరియు టీకాలు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, ముఖ్యంగా ఇప్పటికే ఉన్న రిస్క్ ఫాక్టర్లున్నవారికి అత్యంత ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.