Terror attack | జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి.. యాత్రికుల బస్సుపై కాల్పులు.. 10 మంది దుర్మరణం..

Terror attack | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి దాడికి పాల్పడ్డారు. యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడటంతో ఆ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 33 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

  • Publish Date - June 10, 2024 / 08:09 AM IST

Terror attack : జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి దాడికి పాల్పడ్డారు. యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడటంతో ఆ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 33 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లా తెర్యాత్‌ గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తున్న బస్సుపై రియాసి జిల్లాలోని తెర్యాత్‌ గ్రామం సమీపంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ముందుగా డ్రైవర్‌కు తూటా గాయాలు కావడంతో బస్సు అదుపుతప్పి లోయలో పడింది. దాంతో బస్సులోని 10 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. పది మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి పంపించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వివిధ ఆస్పత్రులకు తరలించారు. మృతులంతా ఉత్తర్‌ప్రదేశ్‌ వాసులుగా పోలీసులు భావిస్తున్నారు. ఉగ్రవాదులు బస్సుపైకి 25 నుంచి 30 తూటాలను పేల్చారని బాధితులు తెలిపారు.

ఎరుపు రంగు మఫ్లర్‌ ధరించిన ఓ ఉగ్రవాది కాల్పులు జరపడాన్ని చూశానని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. కాగా దాడికి తెగబడ్డ ముష్కరులను పట్టుకోవడానికి సైన్యం, సీఆర్పీఎఫ్, పోలీసు బలగాలు గాలింపు చేపట్టాయి. కాగా యాత్రికులపై దాడి బాధాకరమని కేంద్ర మంత్రి అమిత్‌ షా ఆవేదన వ్యక్తంచేశారు. దాడికి బాధ్యులైన వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు.

ఈ ముష్కర దాడిని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువుదీరుతున్న తరుణంలో, పలువురు దేశాధినేతలు మన దేశంలో ఉన్న సమయంలోనే ఈ దారుణం జరిగిందని గుర్తుచేశారు. జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులను నెలకొల్పామని మోదీ సర్కారు జబ్బలు చరుచుకుంటుంటే.. ఇలాంటి ఘటనలు వారి డొల్లతనాన్ని చాటుతున్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ కూడా ఈ దాడిని ఖండించారు.

Latest News