Deer Killed | తిరువనంతపురం : కేరళ( Kerala )లోని త్రిస్సూర్‌లో కొత్తగా ప్రారంభించిన పుత్తూరు జూపార్కు( Puthur Zoological Park )లోకి వీధి కుక్కలు( Stray Dogs ) ప్రవేశించాయి. జూలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ జింకల( Deer )పై దాడులకు పాల్పడుతూ భయానక వాతావరణం సృష్టించాయి. ఈ కుక్కల దాడిలో 10 జింకలు ప్రాణాలు కోల్పోయాయి. నెల రోజుల క్రితం ప్రారంభించిన ఈ జూపార్కులో భద్రతా లోపం వల్లే వీధి కుక్కలు ప్రవేశించాయని జంతు ప్రేమికులు ఆరోపించారు.
ఈ ఘటనపై వన్యప్రాణి నిపుణుడు డాక్టర్ అరుణ్ జచరియా స్పందించారు. మంగళవారం జూపార్కు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. అయితే జింకల మృతికి స్పష్టమైన కారణం పోస్టుమార్టం తర్వాతే తెలుస్తుందన్నారు. ఈ ఘటనపై స్పందించేందుకు జూ డైరెక్టర్ నాగరాజు నిరాకరించాడు.
ప్రస్తుతం పుత్తూరు జూపార్కులోకి స్కూల్, కాలేజీ విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. సాధారణ ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఇక 336 ఎకరాల్లో నిర్మించిన ఈ జూపార్కు.. ఆసియాలోనే రెండో అతిపెద్ద జూ పార్కు కాగా, ఇండియాలో మొదటిది. కేరళ సీఎం విజయన్ అక్టోబర్ 28న జూపార్కును ప్రారంభించారు. 80 జాతులకు చెందిన 534 జంతువులు ఈ జూలో ఉన్నాయి.
