Site icon vidhaatha

Akhnoor | లోయలో పడిన బస్సు.. 22 మంది యాత్రికుల దుర్మరణం

జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
యూపీలోని హత్రాస్‌ నుంచి వెళుతుండగా ప్రమాదం

జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. అఖ్నూర్‌ సమీపంలో 150 అడుగుల లోతైన లోయలో యాత్రికుల బస్సు ఒకటి పడిపోవడంతో అందులో కనీసం 22 మంది చనిపోయారు. మరో 30 మంది వరకూ గాయపడ్డారని అధికారులు తెలిపారు. ‘యూపీలోని హత్రాస్‌ నుంచి బయల్దేరిన బస్సు.. అఖ్నూర్‌ సమీపంలో లోయలో పడిపోయింది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి’ అని జమ్ము జిల్లా మెజిస్ట్రేట్‌ సచిన్‌ కుమార్‌ వైశ్య చెప్పారు. డ్రైవర్‌ బస్సుపై పట్టుతప్పిపోవడంతో చెట్లను రాసుకుంటూ లోయలోకి జారిపోయిందని గాయపడిన ప్రయాణికుడు ఒకరు తెలిపారు.

ఈ బస్సులో ప్రయాణిస్తున్న తీర్థయాత్రికులు రియాసి జిల్లా శివ్‌ఖోరి ఆలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఘటన జరిగిన వెంటనే సమీప గ్రామ ప్రజలు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. సహాయ చర్యల్లో తదుపరి ఇండియన్‌ ఆర్మీకి చెందిన వైట్‌ నైట్‌ కార్ప్స్‌ దళాలు, పోలీసులు పాల్గొన్నారు. గాయపడినవారిని అఖ్నూర్‌ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి అనేక మందిని మెరుగైన వైద్యం కోసం జమ్ము ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి తరలించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడినవారికి 50వేలు నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు అధికారులు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని జమ్ము కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ శర్మ చెప్పారు.

Exit mobile version