ముంబై: ఎవరైనా హత్యకు గురైతే.. ఆ శవం వద్ద లభించిన ఆధారాల ప్రకారం పోలీసులు దర్యాప్తు చేసి, అనుమానితులను పట్టుకుంటారు. అయితే.. అప్పుడప్పుడు శవాలు కూడా సాక్ష్యాలు (corpses also testify) చెబుతాయి. ఈ కేసుకూడా అటువంటిదే. గజిని (Ghajini) సినిమా గుర్తుందా? తన శత్రువుల పేర్లను మర్చిపోకుండా హీరో తన ఒంటిపై పచ్చబొట్టు వేయించుకుంటాడు. ఇక్కడ కాస్త డిఫరెంట్. తను చనిపోతే అందుకు ఎవరెవరు కారణమో ఒక వ్యక్తి ఒంటిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఒకటి రెండు కాదు. ఏకంగా 22 మంది పేర్లు ఉన్నాయి. దర్యాప్తు చేసిన పోలీసులకు అందులో ఒక పేరు ఈ కేసులో సరిపోలింది. (names matched the case to the investigating police) క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా అత్యంత ఆసక్తికరంగా ఉన్న ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబైలోని ఒక స్పాలో బుధవారం తెల్లవారుజామున గురు వాఘమారె (Guru Waghamare) అనే పోలీస్ ఇన్ఫార్మర్ దారుణ హత్యకు గురయ్యాడు. అతడి మృతదేహానికి పంచనామా జరిపిన సమయంలో పోలీసులు అతడి తొడపై రాసి 22 పేర్లు పచ్చబొట్టు ద్వారా రాసి ఉండటాన్ని గమనించారు. తనకేమైనా జరిగితే ఈ 22 మందే కారణమని కూడా మృతుడు ముందే పచ్చబొట్టు (names were written on his thigh through a tattoo) వేయించుకున్నాడు. ఇక్కడో విశేషం కూడా ఉన్నది. ఆ పేర్లలో హత్య జరిగిన స్పా ఓనర్ సంతోష్ షేరేకర్ కూడా ఉన్నాడు. ఈ కేసులో షేరేకర్‌తోపాటు.. మొహమ్మద్ ఫిరోజ్ అన్సారీ (26), షకీబ్ అన్సారీ (28)ని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. హంతకులుగా భావిస్తున్నవారితో సంప్రదింపుల్లో ఉన్నట్టు అనుమానిస్తున్న మరో ఇద్దరిని రాజస్థాన్‌లోని కోటాలో (Rajasthan’s Kota) అరెస్టు చేశారు.
వాఘమారె వద్ద ఒక డైరీ కూడా ఉన్నదని, అందులో ఆయన తన రోజువారీ కార్యకలాపాలను రాసుకునేవాడని పోలీసు అధికారులు తెలిపారు. ఏదైనా రోజు తనకు మంచి జరగకపోతే తాను ఎవరితో ఘర్షణపడ్డాడో వారి పేర్లను ఆ రోజు ఈ డైరీలో రెడ్ పెన్‌తో రాసేవాడని చెప్పారు. ఆ రోజు కనుక మంచి జరిగితే.. గ్రీన్ కలర్ పెన్‌తో వివరాలు రాసేవాడని, సాధారణంగా రోజు గడిస్తే బ్లూ పెన్ వాడేవాడని తెలిపారు. 2014 నుంచి వాఘమారె డైరీ మెయింటెన్ చేస్తున్నాడని చెప్పారు. ఈ డైరీలో అతడు డబ్బు గుంజిన స్పా యజమానుల పేర్లు సైతం ఉన్నాయని పేర్కొన్నారు. డబ్బు కోసం వాంగ్మేర్ వేధింపులకు దిగడంతో అతడిని అంతమొందించాలని ఒక స్పా యజమాని షేరేకర్ నిర్ణయానికి వచ్చాడని, అతడిని చంపేందుకు ఆరు లక్షలు ఇస్తానని ఫిరోజ్ అన్సారీ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలిపారు. ఢిల్లీలో ఉండే తన స్నేహితుడు షకీబ్ అన్సారీని ఫిరోజ్ తనతో కలుపుకొన్నాడు. ఈ హత్యకు షేరేకర్ 4 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడని పోలీసులు గుర్తించారు. నలసోపార నివాసి అయిన ఫిరోజ్.. కిరాయి హంతకుడు. అతడికి కూడా సొంతగా స్పా ఉన్నది. వాఘమారెతో కూడా ఫిరోజ్‌కు గొడవలు ఉన్నాయి. అనేకసార్లు అతడి స్పాపై వాఘమారె పోలీసులకు ఫిర్యాదులు చేశాడు. దీంతో ఫిరోజ్ తన స్పాను ఏడాది క్రితం మూసివేసుకోవాల్సి వచ్చింది.
ఆర్టీఐ కార్యకర్తనని చెప్పుకొంటూ వాఘమారె ముంబైతోపాటు నవీ ముంబై, ఠాణెలో సైతం పలు స్పా యజమానులపై (spa owners in Mumbai) ఫిర్యాదులు చేస్తుండేవాడు. కొద్ది నెలల క్రితం షేరేకర్‌ను ఫిరోజ్ కలిసినప్పుడు వాఘమారె దోపిడీ రాకెట్ గురించి చర్చించుకున్నారని క్రైమ్ బ్రాంచ్ అధికారి ఒకరు తెలిపారు. ‘దీనికొక పరిష్కారం కనిపెట్టాలని ఫిరోజ్‌ను షేరేకర్ కోరాడు. ఖర్చులన్నీ తాను పెట్టుకుంటానని చెప్పాడు. ఘటన జరిగిన తేదీ పది రోజుల ముందు షకీబ్‌ను ఫిరోజ్ పిలిపించాడు. వాఘమారె కదలికలపై ఒక కన్నేసి ఉంచాలని సూచించాడు. వారిద్దరూ ఒక కత్తెరను కొనుగోలు చేసి, దాన్ని రెండుగా విడగొట్టారు. ఒక దానితో వాఘమారెను పొడవగా, మరొక దానితో అతడి గొంతు కోశారు’ అని సదరు అధికారి తెలిపారు.
వాఘమారె జూలై 17న తన 50వ పుట్టిన రోజు జరుపుకొన్నాడు. మంగళవారం సియోన్‌లోని ఒక బార్‌లో తన 24 ఏళ్ల స్నేహితురాలికి పార్టీ ఇచ్చాడు. ఆమె షేరేకర్ స్పాలో పనిచేస్తుంటుంది. ఆమెతోపాటు మరో ఇద్దరు కూడా వచ్చారు. పార్టీ అనంతరం వాఘమారె కారులో అందరూ షేరేకర్ స్పాకు తిరుగు ప్రయాణమయ్యారు. వారిని ఫిరోజ్, షకీబ్ స్కూటర్‌పై అనుసరించారు. మేనేజర్, మరో సిబ్బంది ఇళ్లకు వెళ్లిపోగా, వాఘమారె, అతడి స్నేహితురాలు స్పా లోకి వెళ్లారు. బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో నిందితులు స్పాలోకి ప్రవేశించారు. ముందుగా ఆ మహిళను ఒక గదిలో బంధించి, వేరొక గదిలో వాఘమారెపై విచక్షణారహితంగా కత్తెర ఒక భాగంతో పొడిచారు. గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యారు’ అని క్రైమ్ బ్రాంచ్ అధికారి తెలిపారు.
‘అక్కడి నుంచి కాండివాలి స్పాకు వచ్చిన నిందితులు.. తమ రెయిన్ కోట్లు, షూలు విప్పేసి, కత్తెరలను దాచిపెట్టి, స్కూటర్‌ను వదిలిపెట్టి వెళ్లిపోయారు. నాలాస్‌పారాకు వచ్చి, గరీభ్ రథ్ రైలు ఎక్కి ఢిల్లీకి వెళ్లిపోయారు’ అని క్రైం బ్రాంచ్ డీసీపీ దత్తా నాలవాడే చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్‌ను గమనించి, నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. వాఘమారె 24 ఏళ్ల స్నేహితురాలిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
వాఘమారెను పోలీసులు దభాంగ్ సినిమాలోని ఛుల్‌బుల్ పాండేగా పిలుచుకుంటుంటారు. పార్లే నివాసి అయిన వాఘమారెకు భార్య, 24 ఏళ్ల కుమారుడు ఉన్నారు. గత పదిహేనేళ్లుగా అతడు ఆర్టీఐ కార్యకర్తగా చెలామణి అవుతూ ప్రధానంగా స్పాలను టార్గెట్ చేసుకున్నాడు. హ్యుండాయ్ అరా కారులో తిరిగే వాఘమారె.. తన కారుపై కాయిడా ఔర్ సువ్యవస్థ (శాంతి భద్రతలు) అని రాసుకున్నాడు. అతడిపై రేప్, అసభ్య ప్రవర్థన, డబ్బు గుంజడం తదితరాలపై 8 ఎఫ్‌ఐఆర్‌లు, 22 నాన్ కాగ్నిజబుల్ కేసులు ఉన్నాయి.