Loksabha Elections 2024 | సవరించిన లెక్కల్లో 6% ఓటింగ్‌ పెరుగుదల

దేశంలో కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రచురణపై జరుగుతున్న తీవ్ర జాప్యంపై హక్కుల కార్యకర్తలు, మాజీ సివిల్‌ సర్వెంట్లు, లాయర్లు, విద్యావేత్తలు తదితరులు 18 మంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

  • Publish Date - May 14, 2024 / 07:58 PM IST

శాతాల ప్రకటనలో ఇంత జాప్యమేంటి?
ఎందుకు పెరిగిందో వివరణ ఇవ్వలేదు
ఓటింగ్‌ శాతాలపై ప్రజల్లో అనుమానాలు
ఎన్నికల సంఘానికి 18 మంది ప్రముఖుల లేఖ

న్యూఢిల్లీ: దేశంలో కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రచురణపై జరుగుతున్న తీవ్ర జాప్యంపై హక్కుల కార్యకర్తలు, మాజీ సివిల్‌ సర్వెంట్లు, లాయర్లు, విద్యావేత్తలు తదితరులు 18 మంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను మంగళవారం (14, మే 2024) కలిపి, ఒక లేఖ అందించారు. ఫామ్‌ 17సీలోని పార్ట్‌ 1 రకారం అధికారిక ఓటింగ్‌ శాతాలను తన వెబ్‌సైట్‌ ద్వారా వెంటనే వెల్లడించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. తొలి రెండు దశలకు మాత్రమే ఇప్పటి వరకూ ఎన్నికల సంఘం సవరించిన ఓటింగ్‌ శాతాలను ప్రకటించిందని, అవికూడా పోలింగ్‌ ముగిసిననాడు ప్రకటించిన శాతాలకంటే ఆరు శాతం అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు.

నియోజకవర్గాలవారీగా ఎంతమంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారో అధికారికంగా వెల్లడించలేదని పేర్కొన్నారు. ఈ లేఖపై సంతకాలు చేసినవారిలో హక్కుల ఉద్యమ కార్యకర్త అంజలి భరద్వాజ్‌, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, మాజీ ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి సుందర్‌ బుర్రా, స్వరాజ్‌ అభియాన్‌కు చెందిన యోగేంద్రయాదవ్‌, ఆర్థిక వేత్త జయతి ఘోష్‌, రచయిత సంజయ్‌ ఝా, కళాకారిణి, యాక్ట్‌ నౌ ఫర్‌ హార్మొనీ అండ్‌ డెమోక్రసీ (Anhad)కు చెందిన షబ్నం హష్మి తదితరులు ఉన్నారు.

దాదాపు ఆరుశాతం అధికంగా సవరించిన పోలింగ్‌ శాతాలను ప్రకటించడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అందులో ఫిర్యాదు చేశారు. ‘తొలి విడుత పోలింగ్‌ సందర్భంగా ఎన్నికల సంఘం 19.4.2024న సాయత్రం రాత్రి గంటలకు విడుదల చేసిన ప్రాథమిక అంచనాలో 60శాతానికిపైగా పోలింగ్‌ జరిగినట్టు పేర్కొన్నారు. 11 రోజుల తర్వాత ఏప్రిల్ 30న ఈసీ వెల్లడించిన డాటాలో ఓటింగ్‌ శాతాన్ని 66.14గా పేర్కొన్నారు. అంటే ఏకంగా ఆరుశాతానికిపైగా ఓటింగ్‌ శాతం పెరిగిందని తెలిపారు.

ఇదే విధంగా రెండో దశ పోలింగ్‌ జరిగిన 26.4.2024న విడుదల చేసిన నోట్‌లో రాత్రి ఏడు గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 60.96శాతం పోలింగ్‌ జరిగినట్టు వెల్లడించారు. తదుపరి ఏప్రిల్‌ 30, 2024న విడుదల చేసిన డాటాలో దాన్ని అమాంతం 66.71 శాతానికి పెంచేశారు. తుది శాతాల ప్రకటనలో తీవ్ర జాప్యం, అందులోనూ ఓటింగ్‌ శాతం గణనీయంగా పెరిగిపోవడంపై ఈసీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో ప్రజల్లో ఓటింగ్‌ శాతంపై అనుమానాలు కలుగుతున్నాయి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం అనేది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని లేఖలో తెలిపారు. కనుక ఇప్పటి వరకూ పోలింగ్‌ ముగిసిన ప్రతి నియోజకవర్గం వారీగా ఓటింగ్‌ వివరాలతో కూడిన చట్టబద్ధమైన స్కాన్డ్‌ కాపీని ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే దశల పోలింగ్‌ వివరాలను సైతం ఎలాంటి జాప్యం లేకుండా 48 గంటల్లో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని కోరారు.

Latest News