Site icon vidhaatha

వేగంగా దూసుకెళుతున్న గూడ్స్‌ రైలు.. ట్రాక్‌పై సింహాల గుంపు!

గాంధీనగర్‌: ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యం వందల మంది ప్రాణాలను తీస్తుంది. కానీ.. సమయస్ఫూర్తి.. కొన్ని ప్రాణాలను నిలబెడుతుంది. పశ్చిమబెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం చేసుకున్న రోజే.. ఒక లోకోపైలట్‌ సమయస్ఫూర్తి ప్రదర్శించిన ఘటన గుజరాత్‌లో వెలుగులోకి వచ్చింది. ఆయన చేసిన పనికి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఘటన గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది. పిపావావ్‌ పోర్టు సమీపంలో దాదాపు పది సింహాలు ట్రాక్‌పై ఉన్నాయి. ఆ సమయంలో అటువైపు గూడ్స్‌ రైలు ఒకటి వేగంగా వస్తున్నది. వెంటనే అప్రమత్తమైన లోకోపైలట్‌ ముఖేశ్‌ కుమార్‌ మీనా.. రైలు ఆ సింహాల మీద నుంచి వెళ్లిపోకుండా ఆపేందుకు ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు.

సింహాలు వాటంతట అవే పట్టాల మీద నుంచి పక్కకు వెళ్లిపోయేదాకా ఓపికతో ఉన్న మీనా.. అవి పూర్తిగా వెళ్లిపోయాయని నిర్ధారించుకున్న తర్వాతే రైలును ముందుకు నడిపాడని పశ్చిమ రైల్వే అధికారులు తెలిపారు. లోకోపైలట్‌ సమయస్ఫూర్తిని అధికారులు మెచ్చుకుని, శుభాకాంక్షలు తెలిపారు. టార్చ్‌లైట్‌ వెలుగులో మీనా తీసిన వీడియోల్లో సింహాలు రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళుతూ.. దట్టమైన పొదల్లోకి వెళ్లిపోయాయి.

గత కొన్నేళ్లలో పిపావావ్‌ పోర్టును కలిపే రైలు మార్గంలో అనేక సింహాలు రైళ్లు ఢీకొనడంతో మృత్యువాత పడ్డాయి. అదే సమయంలో లోకోపైలట్‌లో అప్రమత్తంగా వ్యవహరించడంతో ఇదే మార్గంలో దాదాపు 83 సింహాలు సురక్షితంగా పట్టాలు దాటాయని 2022లో పశ్చిమ రైల్వే ఎక్స్‌లో (అప్పటి ట్విట్టర్‌) తెలిపారు. ఇందకోసం కొన్ని సమయాల్లో కొద్ది గంటలపాటు రైళ్లను నిలిపివేసిన సందర్భాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

 

Exit mobile version