4.5 కేజీల బ‌రువు త‌గ్గిన అర‌వింద్ కేజ్రీవాల్..! ఆందోళ‌న‌లో ఆప్ నేత‌లు

  • Publish Date - April 3, 2024 / 10:17 AM IST

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో అరెస్టు అయిన ఆప్ అధినేత‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ కేసులో అరెస్టు అయిన‌ప్ప‌టి నుంచి కేజ్రీవాల్ ఇప్ప‌టి వ‌ర‌కు 4.5 కిలోల బ‌రువు త‌గ్గిన‌ట్లు ఆప్ నేత‌లు పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఆరోగ్యం ప‌ట్ల ఆప్ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ అంశంపై తీహార్ జైలు అధికారులు స్పందించారు. కేజ్రీవాల్ ఆరోగ్యంగా ఉన్నార‌ని పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని జైలు డాక్ట‌ర్లు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని తెలిపారు. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. ఈడీ క‌స్ట‌డీ ముగిసిన అనంత‌రం కోర్టు ఆయ‌న‌కు 14 రోజుల రిమాండ్ విధించ‌డంతో తీహార్ జైలుకు త‌ర‌లించారు. ఏప్రిల్ 15వ తేదీ వ‌ర‌కు కేజ్రీవాల్ జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉండ‌నున్నారు.

తీహార్ జైల్లోని జైలు నంబ‌ర్ 2లో ఆయ‌న ఉన్నారు. డయాబెటిక్‌తో బాధ‌ప‌డుతున్న కేజ్రీవాల్.. ఇటీవ‌లే షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గాయి. ఒకానొక ద‌శ‌లో షుగ‌ర్ లెవ‌ల్స్ 50 కంటే త‌క్కువ‌కు ప‌డిపోయిన‌ట్లు తెలిసింది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపులోకి తెచ్చేందుకు వైద్యులు మెడిసిన్స్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌ధ్యాహ్నం, రాత్రి వేళ ఇంటి భోజ‌నానికి అనుమ‌తిస్తున్నామ‌ని జైలు అధికారులు తెలిపారు. ఆయ‌న‌కు ఏదైనా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఏర్ప‌డితే.. స్పందించేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్‌ను కూడా అందుబాటులో ఉంచిన‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు.

Latest News