Delhi Acid Attack : ఢిల్లీలో డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి కలకలం

ఢిల్లీలో డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి కలకలం రేపింది. కానీ ఈ దాడి వెనక ఉన్న కారణం, దుండగుల ఉద్దేశ్యం ఏమిటో తెలుసా?

Delhi Acid Attack

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాలేజీకి వెళ్తున్న డిగ్రీ విద్యార్థినిపై ముగ్గురు యువకులు యాసిడ్‌ దాడికి పాల్పడటం కలకలం రేపింది. నార్త్‌ ఢిల్లీలోని లక్ష్మీబాయి కాలేజీ సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు యువతిపై యాసిడ్‌ పోసి అక్కడినుంచి పరారయ్యారు. దాడిలో విద్యార్థిని రెండు చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. యాసిడ్ దాడి సమయంలో యువతి తన ముఖానికి రెండు చేతులు అడ్డం పెట్టుకోవడంతో.. అదృష్టవశాత్తూ ఆమె ముఖానికి ఎటువంటి గాయాలు కాలేదు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటన రాజకీయంగానూ దూమారం రేపుతుంది. రాజధానిలో మహిళలకు భద్రత లేదంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. యువతిపై యాసిద్ దాడికి పాల్పడిన వారిలో ఒకరు బాధితురాలిని కొంతకాలంగా వెంబడిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతను ‘స్టాకర్’గా వ్యవహరిస్తున్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను గుర్తించి పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. యాసిడ్ దాడి ఘటనను నిరసిస్తూ ఢిల్లీ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు ఆందోళనలకు దిగాయి. విద్యార్థినిపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.