అగ్నివీర్‌.. వాడుకుని విసిరిపారేసే పథకం.. లోక్‌సభలో రాహుల్‌ నిప్పులు

: అగ్నివీర్‌ పథకంపై ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వంపై తన విమర్శల దాడిని కొనసాగించారు. అగ్నివీర్‌ పథకం అనేది ప్రభుత్వానికి కార్మికులను ‘వాడుకుని పారవేసేద’ని అభివర్ణించారు

  • Publish Date - July 1, 2024 / 05:02 PM IST

న్యూఢిల్లీ: అగ్నివీర్‌ పథకంపై ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వంపై తన విమర్శల దాడిని కొనసాగించారు. అగ్నివీర్‌ పథకం అనేది ప్రభుత్వానికి కార్మికులను ‘వాడుకుని పారవేసేద’ని అభివర్ణించారు. నీట్‌ అనేది వృత్తిపరమైన పరీక్ష కాదని, అదో వ్యాపరపరమైన పరీక్ష అని విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం లోక్‌సభలో ఆయన చర్చలో పాల్గొంటూ ‘అగ్నిపథ్‌ స్కీం ప్రధాని మోదీ ఆలోచనల నుంచి పుట్టిందే కానీ.. సాయుధ దళాల నుంచి వచ్చిందని కాదు. మా ప్రభుత్వం ఏర్పడిన రోజు అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేస్తాం. ఎందుకంటే.. ఇది సాయుధ దళాలకు, దేశ భక్తులకు వ్యతిరేకమైనది’ అని అన్నారు. మందుపాతర పేలుడులో అగ్నివీర్‌ చనిపోతే.. అతడిని అమరజవాన్‌గా పిలువరని చెప్పారు. కార్మికులను వాడుకుని విసిరిపారేసేది అగ్నివీర్‌ అని విమర్శించారు. అగ్నివీరులకు ఎలాంటి నష్టపరిహారం కూడా అందదని అన్నారు. ఈ దశలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జోక్యం చేసుకుంటూ తప్పుడు ప్రకటనలు చేయడం ద్వారా ప్రతిపక్ష నేత సభను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. మన సరిహద్దులను కాపాడే సమయంలో లేదా యుద్ధంలో అగ్నివీర్‌ చనిపోతే అతడి కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం అందుతుందని చెప్పారు.

నీట్‌ పరీక్షలపై రాహుల్‌ మాట్లాడుతూ.. ధనిక విద్యార్థులకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ పరీక్ష విధానాన్ని తయారు చేశారని మండిపడ్డారు. ‘నీట్‌ విద్యార్థులు ఆ పరీక్షను నమ్మడం లేదు. దానిని ధనిక విద్యార్థులకు తప్ప యోగ్యత కలిగిన విద్యార్థుల కోసం తయారు చేయలేదని వారు భావిస్తున్నారు. నీట్‌ పరీక్షకు సిద్ధమయ్యేందుకు విద్యార్థులు సంవత్సరాలు వెచ్చిస్తారు. ఆర్థికంగా, మానసికంగా వారికి వారి కుటుంబం సహకారం అందిస్తుంది. నేను కొందరు నీట్‌ విద్యార్థులను కలుసుకున్నాను. ఈ పరీక్ష ధనిక విద్యార్థులకు ఒక కోటా సృష్టించడానికి, వ్యవస్థలోకి వారిని ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించారని, పేద విద్యార్థుల కోసం కాదని ప్రతి ఒక్కరూ నాకు చెప్పారు.

హిందువులుగా చెప్పుకొనేవారు ఇరవై నాలుగు గంటలూ హింస, విద్వేషాల వ్యాప్తికి పాల్పడుతున్నారని రాహుల్‌ చెప్పినప్పుడు ప్రధాని మోదీ జోక్యం చేసుకున్నారు. ‘అన్న మతాలు, మన మహనీయులు అహింస, నిర్భయం గురించి చెప్పారు. కానీ.. హిందువులుగా చెప్పుకొనేవారు హింస, విద్వేషాలు, అసత్య ప్రచారాల గురించే మాట్లాడుతుంటారు’ అని రాహుల్‌ విమర్శించారు. అయితే.. మోదీ స్పందిస్తూ.. మొత్తం హిందూ సమాజాన్ని హింసాత్మకమైనదని చెప్పడం తీవ్ర అంశమని అన్నారు. హిందువులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపట్ల ప్రతిపక్ష నేత క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దానికి రాహుల్‌ కౌంటర్‌ ఇస్తూ.. తాను చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఉద్దేశించి చేసినవేనని స్పష్టం చేశారు. ‘నరేంద్రమోదీ యావత్‌ హిందూ సమాజం కాదు.. బీజేపీ యావత్‌ హిందూ సమాజం కాదు.. ఆరెస్సెస్‌ యావత్‌ హిందూ సమాజం కాదు’ అని ఘాటుగా బదులిచ్చారు. రాజ్యాంగం పుస్తకం కాపీని, శివుడు, గురునానక్‌ చిత్రపటాలను రాహుల్‌గాంధీ సభలో ప్రదర్శించారు.

Latest News