Mother kills child | ప్రియుడికి నచ్చలేదని మూడేళ్ల కూతురిని చంపేసిన తల్లి

అజ్మీర్‌లో ఘోరం – 3 ఏళ్ల కూతురిని చెరువులోకి తోసేసిన తల్లి. ప్రియుడు చిన్నారిని ఇష్టపడకపోవడంతో ఒత్తిడికి గురై,  లాలిపాటతో నిద్రపుచ్చి చెరువులోకి తోసేసింది. పోలీసుల విచారణలో నిజం వెలుగులోకి.

  • Publish Date - September 18, 2025 / 05:19 PM IST
Ajmer police investigating case where mother threw 3-year-old daughter into lake after lover’s objection

Mother kills child | లాలిపాటే మృత్యుగీతం – నిద్రపుచ్చి చెరువులోకి తోసింది

రాజస్థాన్‌లోని అజ్మీర్​లో జరిగిన ఓ ఘోరం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఒక తల్లి తన 3 ఏళ్ల చిన్నారి కూతురిని చెరువులో పడేసి హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి కారణం ఆమెతో సహజీవనంలో ఉన్న ప్రియుడికి చిన్నారి నచ్చకపోవడమే అని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. వారాణాసికి చెందిన అంజలి (అలియాస్ ప్రియ) తన భర్తతో విడిపోయి అజ్మీర్‌లో హోటల్ రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. అదే హోటల్‌లో పనిచేసే ఆల్కేష్ అనే వ్యక్తితో  వివాహేతర సంబంధం పెట్టుకుని అతనితోనే కలిసి నివసిస్తోంది. ఆల్కేష్ తరచూ అంజలికి భర్త ద్వారా జన్మించిన 3 ఏళ్ల కావ్య గురించి విమర్శలు చేయడం, చెడుగా మాట్లాడుతూ ఆమెను వేధిస్తుండటంతో మానసిక ఒత్తిడి తట్టుకోలేని అంజలి తన కుమార్తెను లాలిపాటతో నిద్రపుచ్చి బయటకు తీసుకెళ్లింది. ఆమెను అజ్మీర్‌లోని అనాసాగర్ చెరువు దగ్గరకి తీసుకెళ్లి నీటిలో తోసేసింది.

రాత్రి పహారా విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ గోవింద్ శర్మ అనుమానాస్పదంగా తిరుగుతున్న అంజలి-ఆల్కేష్‌ను ఆపి ప్రశ్నించగా, అంజలి తన కూతురు అదృశ్యమైందని, వెతుకుతున్నామని అబద్ధం చెప్పింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, బాలికను ఎత్తుకుని చెరువు దగ్గర తిరుగుతున్న అంజలి, కొన్ని గంటల తరువాత ఒంటరిగా ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించింది. దీంతో ఆమె కథపై అనుమానాలు బలపడ్డాయి. పాపను చంపేసిన విషయం అల్కేశ్​కు కూడా తెలియదు. కావ్య మిస్సయిందని అంజలి తనతో ఫోన్​లో చెప్పగా, అల్కేశ్​ కూడా వచ్చి అంజలితో కలిసి వెతుకుతున్నాడు. ఈ క్రమంలోనే వీరువురు కానిస్టేబుల్ గోవింద్ శర్మకు తారసపడ్డారు.

Anjali(Center) and Alkesh(L) in police custody

తరువాతి రోజు ఉదయం చెరువులో చిన్నారి మృతదేహం లభించింది. పోలీసులు అంజలిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించగా, ఆమె కన్నీరు మున్నీరై నేరాన్ని ఒప్పుకుంది. ప్రియుడు ఆల్కేష్‌ ఎప్పటికప్పుడు నీ కూతురుతో ఇబ్బందని వేధించడం వల్లే ఒత్తిడికి గురై ఈ ఘోరానికి పాల్పడినట్లు అంగీకరించింది. ప్రస్తుతం క్రిస్టియన్ గంజ్ పోలీసులు అంజలిపై హత్య కేసు నమోదు చేశారు. ఆల్కేష్​కు  ఈ నేరంలో ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్ర ఏమైనా ఉందా అన్నది విచారించాలని పోలీసులు  నిర్ణయించారు. ఈ సంఘటన స్థానికులను, అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను తీవ్రంగా కలిచివేసింది.

మాతృత్వానికి మాయని మచ్చ తెచ్చిన అంజలిని ఒక్క అజ్మీర్​ ప్రజలే కాకుండా, విషయం తెలిసిన ప్రజలందరూ తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు.