కల్తీ మద్యంపై కఠిన నిబంధనలతో తమిళనాడులో సవరణ చట్టం

తమిళనాడులో ఇటీవల కల్తీ మద్యం తాగి 65 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో చట్టాలను కఠినంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు తమిళనాడు ప్రొహిబిషన్‌ చట్టం 1937లో నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లును ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

  • Publish Date - June 29, 2024 / 05:59 PM IST

చెన్నై : తమిళనాడులో ఇటీవల కల్తీ మద్యం తాగి 65 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో చట్టాలను కఠినంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు తమిళనాడు ప్రొహిబిషన్‌ చట్టం 1937లో నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లును ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అక్రమ మద్యం ఉత్పత్తి, అమ్మకాలు జరిపిన వ్యక్తులపై కఠిన శిక్షలను, భారీ జరిమానాలను ఇందులో ప్రతిపాదించారు.
అక్రమ మద్యం ఎగుమతి, దిగుమతి, రవాణా, కలిగి ఉండటం, తయారు చేయడం, బాటిలింగ్‌, వినియోగించడం వంటి అంశాలకు వేర్వేరు శిక్షలను బిల్లులో పొందుపర్చారు. ప్రభుత్వం నోటిఫై చేసిన తేదీ నుంచి ‘తమిళనాడు ప్రొహిబిషన్‌ (సవరణ) చట్టం, 2024’ అమల్లోకి వస్తుంది. ఈ చట్టంలోని 4, 5, 6, 7, 11 సెక్షన్ల కింద వివిధ నేరాలకు జైలు శిక్ష, జరిమానా మొత్తాన్ని భారీగా పెంచారు. గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, ఐదు లక్షల జరిమానా విధిస్తారు. అక్రమ మద్యం తాగి ఎవరైనా చనిపోతే.. వాటిని సరఫరా చేసినవారికి యావజ్జీవ కఠినకారాగార శిక్ష విధిస్తారు. పది లక్షలకు తక్కువ కాకుండా జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఉత్తర తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో జూన్‌ 18న కల్తీ మద్యం తాగి 65 మంది చనిపోయి, మరో 200 మంది తీవ్ర అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నది. మృతుల్లో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. అనారోగ్యానికి గురైనవారిలో ఇంకా 20 మంది కళ్లకురిచి, సేలం, పుదుచ్చేరి దవాఖానల్లో చికిత్స పొందుతూనే ఉన్నారు.

కల్తీ మద్యం తాగి 65 మంది చనిపోయిన ఘటనలో ప్రభుత్వం ఏదీ దాచాలనుకోవడం లేదని బిల్లును అసెంబ్లీలో ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ చెప్పారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వ్యక్తులను అరెస్టు చేసినట్టు తెలిపారు. ‘కల్తీ మద్యాన్ని అంతమొందించాలన్న పట్టుదలతో ఈ ప్రభుత్వం ఉన్నది. కళ్లకురిచి ఘటన తర్వాత కలెక్టర్లు, పోలీసు అధికారులతో నేను సమావేశాలు జరిపాను. కల్తీ మద్యం ఘటనలో ఇకపై ఎవరైనా ప్రాణాలు కోల్పోతే అందుకు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌, జిల్లా ఎస్పీ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పాను’ అని స్టాలిన్‌ తెలిపారు. రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం అన్న చర్యలూ తీసుకుంటున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాలను నిర్మూలించడంలో రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.
పొరుగునే ఉన్న విల్లుపురంలో వికర్వనాడి అసెంబ్ల స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో కల్లకురిచి ఘటన అధికార డీఎంకే రాజకీయంగా ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే, బీజేపీ వేర్వేరుగా గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని కలిసి డిమాండ్‌ చేశాయి. ఇదే డిమాండ్‌పై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి ఒక్కరోజు నిరాహార దీక్ష నిర్వహించారు.

Latest News