బీజేపీలో పుంజుకుంటున్న మోదీ-షా వ్యతిరేక వర్గం?

బీజేపీలో మోదీ, అమిత్‌షాకు వ్యతిరేకవర్గం క్రమంగా బలం పుంజుకుంటున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల పేర్లు అసమ్మతి నేతల జాబితాలో ఉన్నట్టు చెబుతున్నారు.

  • Publish Date - June 1, 2024 / 07:17 PM IST

న్యూఢిల్లీ: బీజేపీలో మోదీ, అమిత్‌షాకు వ్యతిరేకవర్గం క్రమంగా బలం పుంజుకుంటున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల పేర్లు అసమ్మతి నేతల జాబితాలో ఉన్నట్టు చెబుతున్నారు. తాజాగా నితిన్‌ గడ్కరీ తన నాగపూర్‌ సీటులో ఓడిపోబోతున్నారన్న ప్రచారం గట్టిగా సాగుతున్నది. మోదీ, అమిత్‌షాలకు ప్రత్యామ్నాయంగా నిలువగలిగే నాయకుల్లో ఈ ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. నితిన్‌ గడ్కరీ పోటీ చేస్తున్న నియోజకవర్గం సాదాసీదా ఏమీ కాదు. ఏకంగా ఆరెస్సెస్‌ కేంద్ర కార్యాలయం ఉన్న ప్రాంతం. ఇక్కడ గడ్కరీ ఓడిపోవడం ఖాయమని చెబుతున్నారంటే దాని వెనుక ఏదో బలమైన రాజకీయ కుట్ర కోణం దాగి ఉండొచ్చన్న అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా పరిశీలిస్తుంటే.. మోదీ, షాకు ఇతరులకు మధ్య దాల్‌ మే కుచ్‌ కాలా హై అనే సందేహాలను వెలిబుచ్చుతున్నారు.

గడ్కరీ, మోదీ-షా మధ్య విభేదాలు బహిరంగ రహస్యమేననే అభిప్రాయాలు ఉన్నాయి. గడ్కరీని ఓడించేందుకు మోదీ, అమిత్‌షా, దేవేంద్ర ఫడ్నవీస్‌ పనిచేస్తున్నారని శివసేన (ఉద్ధవ్‌) నేత సంజయ్‌ రౌత్‌ బహిరంగంగానే ఆరోపించారు. గడ్కరీ ఓటమికి పెద్ద మొత్తంలో డబ్బును ఫడ్నవీస్‌ పంపారని కూడా ఆయన విమర్శించారు. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే.. నాగపూర్‌లో బీజేపీ ప్రచార పోస్టర్లలో చాలామటుకు గడ్కరీ ఫొటో లేదు. ఇది ఈ అభిప్రాయాలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నది. 2024 జాతీయ ప్రచారకుల జాబితాలో గడ్కరీకి బీజేపీ అవకాశం కల్పించలేదు. వాస్తవానికి 2019 లోక్‌సభ ఎన్నికల్లో గడ్కరీ స్టార్‌ క్యాంపెయినర్‌ హోదాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పడు అది తారుమారైంది.

మోదీ స్థానంలో ప్రధాని కాగల స్థాయి ఉన్న నేపథ్యంలోనే మోదీ, షా నిఘాలో గడ్కరీ చాలా కాలం నుంచి ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2014లో గడ్కరీ అధికారిక నివాసంలో నిఘాపరికరాలు ఉంచారన్న ఆరోపణలు మోదీ మొదటి దఫా పాలనలోనే వెల్లువెత్తాయి. వాటిని సర్దిపుచ్చేందుకు ఇందులో అంతర్గత హస్తం ఏమీ లేదని గడ్కరీ కొట్టిపారేసినా ఆరెస్సెస్‌ నుంచి తనకు ఒత్తిడి ఉన్నదనే విషయాన్ని మాత్రం ఆయన తర్వాత అంగీకరించారు. సుదీర్ఘకాలం మౌనంగా ఉన్న గడ్కరీ.. తనను బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించిన అనంతరం 2022లో నోరు విప్పారు. వాడుకుని వదిలేసే రాజకీయాల గురించి ప్రస్తావించారు. అధికారం సాధన కోసమే అన్నట్టు రాజకీయాలు తయారయ్యాయని వ్యాఖ్యానించారు.

ఆరెస్సెస్‌ ప్రోద్బలంతో బీజేపీ అధ్యక్షుడిగా ఒక దశలో వ్యవహరించిన గడ్కరీ.. ఆ పార్టీకి అత్యంత పిన్నవయస్కుడైన అధ్యక్షుడిగా ఉన్నారు. మోదీ సహా ఎవరితోనైనా పుల్ల విరిచినట్టు మాట్లాడుతారనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే మోదీ, షా ద్వయం ఆయనను వెంటాడరని చెబుతారు. బీజేపీ, ఆరెస్సెస్‌పై మహారాష్ట్ర పట్టు తప్పించాలనే గుజరాత్‌ లాబీయింగ్‌కు ఆయన సహజంగానే వ్యతిరేకి.

మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు పారిశ్రామిక, ఆర్థిక ప్రాజెక్టులను తరలించడం మహారాష్ట్రపై గుజరాతీ ఆధిపత్యానికి కారణమైంది. రెండు గుజరాతీ వ్యాపార కుటుంబాలు తమ సంపదను యథేచ్ఛగా పెంచుకోవడంతోపాటు.. మహారాష్ట్రలో ప్రధాన కాంట్రాక్ట్‌లను సొంతం చేసుకున్నాయి. ఎయిర్‌పోర్టుల నుంచి ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీల దాకా గుజరాతీల చేతుల్లోనే ఉన్నాయి. గడ్కరీ ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పటికీ.. ఆయనకు అవకాశం ఇవ్వలేదు. తొలి అవకాశం మహారాష్ట్రకే దక్కాలనే అభిప్రాయంతో గడ్కరీ ఉండటమే అందుకు కారణం. మహారాష్ట్ర సంపద గుజరాత్‌కు తరలిపోకుండా అడ్డుకుంటారనే భావనతోనే ఆయనకు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. గడ్కరీని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోవడం వెనుక కూడా.. మోదీ శత్రువులను దగ్గరే ఉంచుకుని, మహారాష్ట్ర ఆర్థిక పగ్గాలు గుజరాత్‌కు అప్పగించడానికేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

గడ్కరీకి ఆరెస్సెస్‌ మద్దతు ఎందుకు?

గడ్కరీ విజయవంతమైన వ్యాపారవేత్తే కాకుండా.. ఆరెస్సెస్‌కు ఆర్థికంగా మూలస్తంభం, దాని కోశాధికారి కూడా అనే ప్రచారం ఉన్నది. ఆయనపై దాడి జరగడం అంటే.. ఆరెస్సెస్‌ ఆర్థిక మూలాలపై నేరుగా దాడి చేయడమేనని చాలా మంది భావిస్తారు. రుజువు చేయడం సాధ్యం కాకపోవచ్చుగానీ.. గడ్కరీకి, ఆరెస్సెస్‌కు మధ్య ఆర్థిక సంబంధాలు బలంగా ఉన్నాయనే ప్రచారం ఉన్నది.

అయితే.. గడ్కరీ నేతృత్వంలోని శాఖ పూర్తి చేసిన అనేక రోడ్డు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల క్రెడిట్‌ను మోదీ ఏ మాత్రం సిగ్గుపడకుండా తన ఖాతాలో వేసేసుకున్నారని, జాతీయ రహదారులు, వంతెలు వంటివి ఉన్నట్టుండి గడ్కరీ కృషి కాకుండా.. మోదీ కృషిగా బీజేపీ కళ్లకు కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరో ఆసక్తికర అంశం.. బీద్‌లో మీడియాతో మాట్లాడిన గడ్కరీ.. తన నియోజకవర్గంలో ఓటరు జాబితా నుంచి దాదాపు లక్షన్నర ఓట్లు అదృశ్యమయ్యాయని ధృవీకరించారు. అంటే.. గడ్కరీ మద్దతుదారుల ఓటు ఆయనకు పడకుండా చేసే ప్రయత్నమేనని సులభంగానే అర్థం అవుతున్నది. ఇది సహజంగానే గడ్కరీ ప్రత్యర్థికి సానుకూల అంశంగా పరిణమిస్తుంది. ఇవన్నీ గమనిస్తే సంజయ్‌ రౌత్‌ ఆరోపణలు నిజమేనా? అనే సందేహాలు కలుగక మానవు. అదే జరిగితే.. రెండు వర్గాల మధ్య శత్రుత్వం మరింత పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తయితే.. ఇలాంటి పరిస్థితుల్లో కూడా గడ్కరీ రెబల్‌గా ఎందుకు మారడం లేదు? వీపీ సింగ్‌ తరహాలో తిరుగుబాటు జెండా ఎందుకు ఎత్తడం లేదు? పార్టీలో అంతర్గత అవినీతిని ఎందుకు బయటపెట్టడం లేదు? రాజుగారికి వస్త్రాలు లేవన్న సంగతిని ప్రపంచానికి ఎందుకు చాటడం లేదు? ఎందుకంటే.. గడ్కరీ స్విచ్‌ మోదీ, షా చేతిలో ఉన్నది. గడ్కరీ కుమారుడి కారులో ఏడేళ్ల వయసున్న బాలిక మృతదేహం దొరికిందని వార్తలు వచ్చాయి. మూడో తరగతి చదివే ఆ పాప లోదుస్తులకు రక్తపు మరకలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. తమ బిడ్డపై లైంగిక దాడి చేసి, హత్య చేశారని ఆ పాప కుటుంబం ఆరోపిస్తున్నది.

2013లో ఈ కేసులో మహారాష్ట్ర క్రైం ఇన్వెస్టిగెషన్‌ డిపార్ట్‌మెంట్‌ రెండోసారి దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్టును కోర్టు తిరస్కరించింది. తాము పూర్తిగా సహకరించామని, ఈ కేసులో ఎలాంటి దర్యాప్తును ఎదుర్కొనేందుకైనా సిద్ధమని గడ్కరీ చెప్పినప్పటికీ.. గడ్కరీ ప్రతిష్ఠ, తన కుమారుడి తలపై కత్తి వేలాడుతూనే ఉన్నది. ఇదెలా ఉన్నప్పటికీ గడ్కరీ మౌనంగా తన వర్గాన్ని పెంచుకుంటూ యోగి ఆదిత్యనాథ్‌, ఇతర ఆరెస్సెస్‌ మద్దతు ఉన్న సీనియర్‌ నేతలకు దగ్గరవుతూ బీజేపీలో మరో అధికార కేంద్రాన్ని తయారు చేసేందుకు పావులు కదుపుతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల నాగపూర్‌ సందర్శించిన సందర్భంగా ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌.. గడ్కరీ ఇంటికి వెళ్లడం ఈ కొత్త అధికార కేంద్రం తయారవుతున్నదనేందుకు సంకేతాలని చెబుతున్నారు.

తుది విడత పోలింగ్‌ ముగిసిన అనంతరం వెల్లడైన ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు బీజేపీకి హ్యాట్రిక్‌ ఖాయమని చెబుతున్నా.. వాస్తవ పరిస్థితుల కోసం జూన్‌ 4 వరకూ ఆగాల్సి ఉన్నది. ఒకవేళ ఎగ్జిట్‌ ఫలితాలనే వాస్తవ ఫలితాలు ప్రతిబింబిస్తే.. మోదీ షా ద్వయం గడ్కరీనే కాదు.. ఆరెస్సెస్‌ సార్వభౌమత్వాన్ని సైతం విచ్ఛిన్నం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రకంగా చేస్తే.. నాగపూర్‌ ఎన్నిక గడ్కరీ రాజకీయ భవిష్యత్తునే కాదు.. ఆరెస్సెస్‌ ఉనికిపైనా ప్రశ్నలు లేవనెత్తుతాయని అంటున్నారు.

 

Latest News