లద్దాఖ్‌లో నదిలో కొట్టుకుపోయిన ఆర్మీ ట్యాంక్‌.. ఐదుగురు సైనికుల మృతి

తూర్పు లద్దాఖ్‌లో విషాదం చోటు చేసుకున్నది. షయాక్‌ నదిని యుద్ధట్యాంకుతో దాటే ప్రయత్నంలో శుక్రవారం ఐదుగురు సైనికులు కొట్టుకుపోయారని అధికార వర్గాలు శనివారం పేర్కొన్నాయి.

  • Publish Date - June 29, 2024 / 05:16 PM IST

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో విషాదం చోటు చేసుకున్నది. షయాక్‌ నదిని యుద్ధట్యాంకుతో దాటే ప్రయత్నంలో శుక్రవారం ఐదుగురు సైనికులు కొట్టుకుపోయారని అధికార వర్గాలు శనివారం పేర్కొన్నాయి. ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ‘లద్దాఖ్‌లో నదిని దాటే క్రమంలో చోటు చేసుకున్న దురదృష్టకర ఘటనలో ఐదుగురు సాహస జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా బాధించింది’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. వారు మన దేశానికి చేసిన గొప్ సేవలను ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో యావత్‌దేశం వారి వెంట నిలుస్తున్నదని పేర్కొన్నారు. 2024, జూన్‌ 28న మిలిటరీ శిక్షణ కార్యక్రమం ముగించుకుని తూర్పు లద్దాఖ్‌లోని సాసెర్‌ బ్రాంగ్సా సమీపంలోని షయాక్‌ నదిని ఆర్మీ ట్యాంకు దాటే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నదని లెహ్‌ లోని ఆర్మీ విభాగం ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ కార్ప్స్‌ తెలిపింది. వెంటనే సహాయ బృందాలు అక్కడికి చేరుకున్నప్పటికీ.. నది ఉధృతి, నీటిమట్టం ఎక్కువగా ఉండటంతో సహాయ బృందాలు వారిని కాపాడలేక పోయాయని పేర్కొన్నది. ఐదుగురు సైనికుల మృతిపై ఇండియన్‌ ఆర్మీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మృతి చెందిన సైనికులు ఇండియన్‌ ఆర్మీ ఆర్మ్‌డ్‌ రెజిమెంట్‌కు చెందినవారు. మంచు కరగడంతో నదిలో నీటి మట్టం, ఉధృతి పెరిగాయని తెలిపింది.

Latest News