CP Radhakrishnan | ఉప రాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా సీ.పీ.రాధాకృష్ణన్ పేరును ఎన్ డీ ఏ ఖరారు చేసింది. బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థిని బలపరుస్తామని ఎన్ డీ ఏ పక్షాలు ఇదివరకే ప్రకటించాయి. ఆదివారం సాయంత్రం న్యూఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీసీ రాధాకృష్ణన్ పేరును ఖరారు చేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయాన్ని ప్రకటించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్నారు. గతంలో ఆయన తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. జార్ఖండ్ , తెలంగాణ రాష్ట్రాలకు ఆయన గవర్నర్ గా పనిచేశారు. 2024 జూలై 31 నుంచి ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్నారు. అంతకుముంద 2023 ఫిబ్రవరి 18 నుంచి 2024 జూలై 30 వరకు జార్ఖండ్ గవర్నర్ గా పనిచేశారు. 2024 మార్చి నుంచి జూలై వరకు ఆయన తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. 2024 మార్చి నుంచి ఆగస్టు వరకు పాండిచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా వ్యవహరించారు. ఆగస్టు 21న సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు పాల్గొంటాయి. ఎన్డీఏ భాగస్వామపార్టీలకు చెందిన సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఢిల్లీకి రావాలని ఎన్డీఏ కోరింది.
1957 అక్టోబర్ 20న తమిళనాడు తిరుపూర్ లో ఆయన జన్మించారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా 2003 నుంచి 2006 వరకు పనిచేశారు. 1998, 1999 లోక్ సభ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి ఆయన రెండు దఫాలు ఎంపీగా గెలిచారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ తో ఆయనకు సంబంధాలున్నాయి. భారతీయ జనసంఘ్ లో కూడా ఆయన పనిచేశారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన 93 రోజుల పాటు రథయాత్ర నిర్వహించారు. నదుల అనుసంధానం, టెర్రరిజం, స్థానిక సమస్యలపై ప్రధానంగా ఫోకస్ చేశారు.
1993 నుంచి 1998 వరకు ఆర్ఎస్ఎస్ ప్రాంత్ సంఘచాలక్‌గా పనిచేశారు. సామాజిక సమీకరణలను పరిశీలిస్తే ఆయన ఓబీసీ సముదాయంలోని గౌండర్ సముదాయానికి చెందిన నేత.బీజేపీ ఈ సముదాయాన్ని కె. అన్నామలై ద్వారా ఆకర్షించడానికి గట్టిగా ప్రయత్నించింది. అయితే తమిళనాడులో ఎడప్పాడి కె. పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకేతో పొత్తు కుదిరిన తర్వాత ఈ ప్రయత్నం ఆగిపోయింది. పళనిస్వామి కూడా అదే సముదాయానికి చెందినవారు.
రాధాకృష్ణన్ ను ఉప రాష్ట్రపతి పదవి అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా దక్షిణాదిలో బీజేపీ విస్తరణకు ఉపయోగపడుతోందనే భావనను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ద్రవిడ పార్టీల ఆధిపత్యంలో ఉన్న తమిళనాడులో పార్టీ విస్తరణ కోసం బీజేపీ అనేక వ్యూహాలను రచిస్తోంది. ఎన్నో ప్రయత్నాలు విఫలమయ్యాయి. ద్రవిడ రాజకీయాలు ఆధిపత్యం చెలాయించే తమిళనాడులో వెనుకబడిన కుల సమూహానికి ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా కాషాయపార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి.