Site icon vidhaatha

Kejriwal | కేజ్రీవాల్‌ను చూసి భయపడుతున్న బీజేపీ

ఎన్నికల ప్రచారంలో పాల్గొనొద్దనే నన్ను జైల్లో వేశారు

కురుక్షేత్ర: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనను చూసి భయపడిందని, అందుకే ఎన్నికల ప్రచారంలో పాల్గొననీయకుండా జైల్లో వేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. మంగళవారం హర్యానాలోని కురుక్షేత్ర నియోజకవర్గ పరిధిలో ఆయన తమ పార్టీ అభ్యర్థి సుశీల్‌ గుప్తాకు మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీపై కేజ్రీవాల్‌ నిప్పులు చెరిగారు.

మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు జూన్‌ 1వ తేదీ వరకూ మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. పెహోవా రోడ్‌ షో సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడిన కేజ్రీవాల్‌.. ‘మార్చి 16న ఎన్నికల ప్రకటన వచ్చింది. మార్చి 21న నన్ను జైలుకు పంపారు. అంటే.. కేజ్రీవాల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని వాళ్లు కోరుకున్నారు. వాళ్లు కేజ్రీవాల్‌ అంటే భయపడుతున్నారు’ అని చెప్పారు.

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ తన సోదరుడని అభివర్ణించిన కేజ్రీవాల్‌.. తనకు పెహోవాతో ఉన్న సంబంధాన్ని ప్రస్తావించారు. మాన్‌ అత్తమామలది ఈ ఊరేనని చెప్పారు. ‘ఈ రోజు మాన్‌ మామ ఇంద్రజీత్‌సింగ్‌ మాతో ఉన్నారు.. నన్ను జైలుకు పంపిన బీజేపీకి ఈ ప్రాంతం నుంచి ఒక్క ఓటు కూడా పడదు’ అని అన్నారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత కేజ్రీవాల్‌ హర్యానాలో పర్యటించడం ఇదే మొదటిసారి. హర్యానాలోని పది లోక్‌సభ స్థానాలకు ఆరో దశలో మే 25న పోలింగ్‌ నిర్వహించనున్నారు.

 

Exit mobile version