Site icon vidhaatha

Srinivasa Prasad | అనారోగ్యంతో కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత..

Srinivasa Prasad : సీనియర్‌ రాజకీయ నాయకుడు, బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్‌ (76) అనారోగ్యంతో కన్నుమూశారు. కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన అనారోగ్యంతో ఇటీవల బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

శ్రీనివాస ప్రసాద్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చామరాజనగర్‌ నియోజకవర్గం నుంచి శ్రీనివాస ప్రసాద్‌ ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. మైసూర్‌ జిల్లాలోని నంజన్‌గుడ్‌ నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితం నుంచి విరామం తీసుకుంటున్నట్లు గత నెల 18ననే ఆయన ప్రకటించారు.

ఆయన 1976లో జనతా పార్టీ చేరడం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1979లో కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీలో చేరడానికి ముందు కొన్నాళ్లు జేడీఎస్‌, జేడీయూ, సమతా పార్టీలోనూ పనిచేశారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న 1999-2004 సమయంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పంపిణీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2013లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో కర్ణాటక రాష్ట్ర రెవెన్యూ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2016లో తిరిగి బీజేపీలో చేరారు. 2017లో నంజన్‌గుడ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో చామరాజనగర్‌ నుంచి మరోసారి ఎంపీగా విజయం సాధించారు.

Exit mobile version