Site icon vidhaatha

Operation Sindoor | ఆపరేషన్‌ సిందూర్‌పై బీఎస్‌ఎఫ్‌ కొత్త వీడియోలు.. వణికిపోయిన పాక్‌ సైన్యం

Operation Sindoor | ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా మే 9, 10 తేదీల మధ్య రాత్రి పాకిస్తాన్‌ పోస్టులపై చేసిన దాడులకు సంబంధించిన వీడియోలను సరిహద్దు భద్రతాదళం (BSF) మంగళవారం విడుదల చేసింది. మే 7 నాటి ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం ఈ దాడులు జరిగినట్టు తెలిపింది. పాకిస్తాన్‌ నుంచి సరిహద్దు కాల్పులకు భారత్‌ దీటుగా, భారీ స్థాయిలో స్పందించిందని వెల్లడించింది. జమ్ము కశ్మీర్‌ బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ శశాంక్‌ ఆనంద్‌ మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తానీ సైనిక పోస్టుల నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయని, వాటికి తాము ముందుగానే సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ‘ముందుగానే సన్నద్ధంగా ఉండటం కారణంగా సరిహద్దు కాల్పుల సందర్భంగా పలు పాకిస్తానీ పోస్టులకు తీవ్ర నష్టం కలిగించాం. మా వైపు ఎలాంటి నష్టం వాటిల్లలేదు’ అని ఆనంద్‌ తెలిపారు.

మే 8వ తేదీ రాత్రి మేం ఈ ఆపరేషన్‌ చేపట్టినప్పుడు శత్రువు వణికిపోయిన విషయం స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాతి రోజు.. అంటే మే 9న పాకిస్తాన్‌ సైన్యాలు జమ్ము ఉత్తర ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు రేఖ వెంబడి ఎలాంటి రెచ్చగొట్టుడు చర్యలు లేకున్నా కాల్పులు ప్రారంభించాయి. ‘ఇటువంటి సందర్భం కోసం బీఎస్‌ఎఫ్‌ అప్పటికే సిద్ధంగా ఉన్నది. మే 9, 10 తేదీల మధ్య పాకిస్తాన్‌ సరిహద్దులపై భారీ స్థాయిలో గుళ్ల వర్షాన్ని కురిపించింది. అవకాశం వస్తే అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని టెర్రరిస్ట్‌ లాంచ్‌ప్యాడ్స్‌పై కూడా దాడి చేయాలని ప్లాన్‌ చేశాం’ అని ఆయన తెలిపారు. బీఎస్‌ఎఫ్‌ డీఐజీ ఎస్‌ఎస్‌ మంద్‌ మాట్లాడుతూ.. ‘మే 8వ తేదీన సరిహద్దు వద్ద 40 నుంచి 50 మంది వ్యక్తులను మా నిఘా వర్గాలు గుర్తించాయి. వారిపై మేం ముందస్తు దాడులు చేశాయి. దాంతో పాకిస్తాన్‌ సేనలు బీఎస్‌ఎఫ్‌ సరిహద్దు ఔట్‌ పోస్ట్‌లపై కాల్పులకు తెగబడ్డాయి. వాటిని మేం ప్రతిఘటించాం. మా దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు, పాకిస్తాన్‌ రేంజర్లు, అధికారులు గాయపడటమో, చనిపోవడమో జరిగిందని మాకు అందిన వివరాలను బట్టి తెలుస్తున్నది’ అని చెప్పారు.

ఎల్‌వోసీ వద్ద పాకిస్తాన్‌ వైపు లోనీలో కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న లష్కరే తాయిబా లాంచ్‌ప్యాడ్‌పై తాము ప్రణాళిక ప్రకారం దాడి చేశామని జమ్ము కశ్మీర్‌ బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆనంద్‌ వెల్లడించారు. ఉగ్రవాదులు మళ్లీ తమ శిబిరాలకు, లాంచ్‌ ప్యాడ్‌లకు చేరుకుంటున్నట్టు తమకు అనేక ఇన్‌పుట్స్‌ అందాయని ఆయన వెల్లడించారు. ఎల్‌వోసీ, అంతర్జాతీయ సరిహద్దులో చొరబాట్లు చోటు చేసుకునేందుకు అవకాశం ఉన్నదని తెలిపారు. భద్రతా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. మే 7వ తేదీన భారత సైన్యాలు ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట పాకిస్తాన్‌, ఆక్రమిత కశ్మీర్‌లలోని 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస, వందకు పైగా ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే.

Exit mobile version