ఆయనో నాయకుడు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆ అభ్యర్థి గెలుపు కోసం ఆయన భార్య కష్టపడి పని చేయాలి. కానీ తన భార్యకు ఆ నాయకుడు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో భార్య నుంచి విడిపోయి.. ఓ గుడిసెలో నివాసం ఉంటున్నారు. ఎందుకో తెలుసా..?
భార్యాభర్తలిద్దరూ రాజకీయ నాయకులే. కానీ ఒకే పార్టీ కాదు.. ఆయనేమో బహుజన్ సమాజ్ పార్టీ. ఆమెనేమో కాంగ్రెస్ పార్టీ. ఇద్దరి ఐడియాలజీలు వేర్వేరు కనుక.. ఈ ఎన్నికల వరకు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. మరి ఆ ఇద్దరి గురించి తెలుసుకోవాలంటే మధ్యప్రదేశ్‌కు వెళ్లాల్సిందే.
మధ్యప్రదేశ్‌లోని బాలఘాట్ నియోజకవర్గం నుంచి కంకర్ ముంజారే బీఎస్పీ తరపున లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. భార్య అనుభా ముంజారే కాంగ్రెస్ ఎమ్మెల్యే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అనుభా ముంజారే.. బీజేపీ సీనియర్ నాయకులు గౌరిశంకర్ బైసెన్‌ను ఓడించారు. అయితే కంకర్, అనుభా వేర్వేరు పార్టీల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇద్దరి ఐడియాలజీలు కూడా వేరు. కాబట్టి ఒకే ఇంట్లో ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే.. భవిష్యత్‌లో ఏదైనా జరగరానిది జరిగితే, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని జనాలు అనుకుంటారని చెప్పి.. తన భార్యకు దూరంగా ఉండాలని కంకర్ ముంజారే నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో కంకర్ ముంజారే భార్యకు దూరంగా వెళ్లిపోయారు. బాలఘాట్ నియోజకవర్గంలోని ఓ డ్యాం వద్ద ఉన్న గుడిసెలో కంకర్ నివాసం ఉంటున్నారు. అక్కడ్నుంచే తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక బాలఘాట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున సామ్రాట్ సరస్వత్ పోటీ చేస్తున్నారు. సామ్రాట్ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అనుభా ముంజారే స్పష్టం చేశారు. ఇక ఏప్రిల్ 19వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత తన భార్య వద్దకు వెళ్తానని కంకర్ పేర్కొన్నారు. కంకర్, అనుభాకు వివాహమై 33 ఏండ్లు అవుతోంది. వీరికి కుమారుడు ఉన్నారు.