హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విధాత):
Caste Census Karnataka | కర్ణాటక రాష్ట్రంలో సోమవారం (సెప్టెంబర్ 22వ తేదీ) నుంచి కుల గణన (సామాజిక, విద్య సర్వే) ప్రారంభమవుతోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర బీసీ కమిషన్ కావాల్సిన ఏర్పాట్లు, శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసింది. అయితే ఈ సర్వేపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. గతంలో 2015లో సర్వే చేయగా, అది తప్పుల తడకగా ఉండటం, కాలం చెల్లడంతో మరోసారి నిర్వహించాలని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కుల గణన సర్వే సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 7వ తేదీన ముగించనున్నారు. రాష్ట్రంలోని రెండు కోట్ల నివాసాలలో ఏడు కోట్ల మంది ప్రజల నుంచి 1.85 లక్షల మంది ఉపాధ్యాయులు వివరాలు సేకరించనున్నారు.
ఇప్పటికే 1.55 కోట్ల నివాసాలకు స్టిక్కర్లను అతికించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.420 కోట్లు వెచ్చిస్తున్నది. సామాజిక, విద్య స్థితిగతులపై 60 ప్రశ్నలతో ఒక సర్వే పత్రాన్ని రూపొందించామని కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్ పర్సన్ మధుసూధన్ ఆర్. నాయక్ వెల్లడించారు. కుల గణన నివేదిక వచ్చే డిసెంబర్ నాటికి సిద్ధం చేసి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అందచేస్తామని తెలిపారు. ఆశా వర్కర్లు ముందుగానే ప్రతి ఇంటికీ వెళ్లి దరఖస్తు ఫారాలను అందచేస్తారని, సేకరించిన వివరాలను రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలను మొబైల్ నెంబర్‌తో అనుసంధానం చేస్తున్నామని పేర్కొన్నారు.