caste census | 16వ జనగణనకు సంబంధించి సోమవారం జారీ చేసిన గెజిట్‌లో కుల గణన ప్రస్తావన లేకపోవడం చర్చకు దారి తీసింది. ఈసారి నిర్వహించే జనాభా లెక్కల సేకరణలో కుల గణన కూడా ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా విడుదల చేసి గెజిట్‌లో మాత్రం ఆ మాటే లేదు. దీనిపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఎక్స్‌లో స్పందించారు. బీజేపీ ప్రభుత్వం మరోసారి యూటర్న్ తీసుకుందని ఆయన అన్నారు. 16వ జనాభా లెక్కలపై జారీ చేసిన నోటిఫికేషన్ కుల గణన ఆశలపై నీళ్లు చల్లిందని అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మరో యూటర్న్ అవుతుందా? లేక ఆ వివరాలను తర్వాత ప్రకటిస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
కుల గణన మాత్రమే కాకుండా.. కులాల వారీగా సామాజిక, ఆర్థిక పరిస్థితుల వివరాలను సైతం సేకరించేలా తెలంగాణ నమూనాను అనుసరించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది. 2025 ఏప్రిల్ 30న ప్రకటించిన దానినే గెజిట్‌లో రిపీట్ చేశారని జైరాం రమేశ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరంతరాయంగా చేసిన డిమాండ్ కారణంగానే దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ అంగీకరించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ‘ఈ డిమాండ్ చేసినందుకు కాంగ్రెస్ నాయకులను అర్బన్ నక్సల్స్ అని ఆయన (మోదీ) అన్నారు. పార్లమెంటులోనూ, సుప్రీంకోర్టులోనూ మోదీ ప్రభుత్వం కుల గణనను వ్యతిరేకించిన మోదీ ప్రభుత్వం.. 47 రోజుల క్రితం కులగణన చేపడతామని ప్రకటించింది’ అని జైరాం రమేశ్ తెలిపారు. ‘ఈ రోజు జారీ చేసిన గెజిట్ కుల గణనను చేర్చడంలో మౌనం వహించింది. ఇది యూటర్న్‌ల పండితుడి మరో యూటర్న్? లేక ఆ వివరాలు తర్వాత ప్రకటిస్తారా?’ అని జైరాం రమేశ్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం 2027లో 16వ జన గణన నిర్వహించేందుకు సోమవారం గెజిట్ జారీ చేసింది. 2011లో చివరిసారి జనాభా లెక్కలు సేకరించారు. పదహారేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జనగణన నిర్వహించనున్నారు.