Site icon vidhaatha

ఆధార్ చెల్లింపులతో పేదల పథకాలకు కోత

– టెక్నాలజీ ముసుగులో సంక్షేమానికి దూరం చేయడమే..

– పేద ప్రజల నోళ్ళల్లోదుమ్ముకొడుతున్న ప్రధాని

– కాంగ్రెస్ జనరల్ సెక్రటరి జయరాం రమేష్

– కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు

న్యూఢిల్లీ: ‘ప్రధానమంత్రి మోదీ 2024 నూతన సంవత్సరపు బహుమతిగా పేద ప్రజలకు తన క్రూరమైన టెక్నాలజీ పథకాన్ని ఇవ్వబోతున్నాడు. ఎంజీఎన్ఆర్ఈజీఏ చెల్లింపులకు ఆధార్ లింక్ పేరుతో ప్రజలను వంచించే ప్రభుత్వ పథకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి’ అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేస్తూ బీజేపీ ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉపాధి పథకం కింద పనిచేసే పేద ప్రజలకు సంపాదించుకునే అవకాశం లేకుండా చేసేందుకే పేమెంట్స్ లలో ఆధార్ లింక్ అనివార్యతను చొప్పించారని విమర్శించారు. కొత్త టెక్నాలజీ ద్వారా కోట్ల కొద్ది భారతీయులను ఆ పనిలో నుండి తప్పించడమే అవుతుందని చెప్పారు.


2024 నూతన సంవత్సరం సందర్భంగా మోడీ ప్రభుత్వం రోజు గార్ గ్యారెంటీ యోజనలో ఆధార్ బేస్డ్ పేమెంట్స్ ని అమలు చేయాలని ఉత్తర్వులిచ్చిందన్నారు. ఈ పద్ధతి ద్వారా కోట్ల కొద్ది భారతీయులు గత కొన్నేళ్లుగా సంక్షేమ పథకాల ద్వారా పొందుతున్న లాభాన్ని పొందలేక వంచించబడతారని చెప్పారు. ఇది మోడీ ప్రభుత్వం నూతన సంవత్సరం సందర్భంగా పేద ప్రజలకు ఇస్తున్న క్రూరమైన కానుకగా అభివర్ణించారు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందని, ఇటువంటి ప్రజా వ్యతిరేక పద్ధతులపై పోరాడుతామని అన్నారు.


టెక్నాలజీ పేరుతో ఈ పథకాలను తీసుకురావడం ద్వారా కోట్ల కొద్ది భారతీయులు పేద, కింది తరగతి వర్గాల ప్రజలు ఈ సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందలేక పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పేమెంట్స్ లో అందకుండా మోసాలకు గురవుతారని, దీన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. టెక్నాలజీని ఒక ఆయుధంగా ఉపయోగించటం మోడీ గవర్నమెంటు తక్షణమే మానుకోవాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ముందు నుంచీ రోజ్ గారి గ్యారెంటీ వంటి పేద ప్రజల సంక్షేమ పథకాలని కావాలని ఉపేక్షిస్తూ వస్తున్నట్లు ఆరోపించారు. పేద ప్రజల బాగోగులు, వారి సంక్షేమం కన్నా.. కార్పొరేటర్లకు దోచిపెట్టడమే ఈ ప్రభుత్వానికి ముఖ్యమైందన్నారు. కోట్లాది బీద ప్రజల కష్టాలతో ఆయనకు ఎటువంటి సంబంధం లేదని, ఈ క్రమంలోనే సంక్షేమ పథకాలను వారికి దూరం చేసే కుట్ర సాగుతోందన్నారు.


నెమ్మదిగా సంస్కరణలు చేస్తూ, పెద్దఎత్తున టెక్నాలజీ ముసుగులో దేశ ప్రజల సంక్షేమ పథకాలను క్రమంగా తగ్గిస్తూ, వారి భాగస్వామ్యం లేకుండా చేస్తున్నారని అన్నారు. వీటి బడ్జెట్లను వేరే వైపు మళ్లిస్తూ, మరోవైపు దేశం అభివృద్ధి చెందుతోందని.. ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతున్నదని కేంద్రం ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నదన్నారు.

Exit mobile version