BJP : ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ (BJP) అనుకున్న మేర ఫలితాలు రాబట్టలేకపోయింది. కొన్ని రాష్ట్రాల్లో అధిక స్థానాల్లో కొత్తగా ఎంపీ సీట్లను గెలవగా.. మరికొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అందులో యూపీ లాంటి అతిపెద్ద రాష్ట్రంతోపాటు రాజస్థాన్ కూడా ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీకి తగ్గిన ఓట్ల శాతం ఒక్క శాతమే అయినా కొన్ని రాష్ట్రాల్లో ఆ తేడా భారీగా ఉంది. ఆ లోటును మిగిలిన రాష్ట్రాల ద్వారా భర్తీ చేసుకోవాలని చూసినా అంతగా ఫలితం రాలేదు.
బీజేపీ దేశంలోనే అత్యధిక శాతం ఓట్లను రాజస్థాన్‌లో కోల్పోయింది. ఆ రాష్ట్రంలో 2019తో పోలిస్తే ఆ పార్టీకి 9.28 శాతం ఓట్లు తగ్గాయి. ఫలితంగా 11 సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న జాట్లు ఈసారి కాంగ్రెస్‌కు జై కొట్టారు. వారితోపాటు మీనాలు, గుజ్జర్ సామాజిక వర్గాలు కాంగ్రెస్ వెంటే నిలిచాయి. రాష్ట్రంలోని 7 ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో 4 గెలుచుకుని కాంగ్రెస్ రికార్డు సృష్టించింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని కాంగ్రెస్ చేసిన ప్రచారం ఫలించింది.
ఒడిశాలో అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకోవడంతోపాటు 2019తో పోలిస్తే 6.96 శాతం ఓట్లను బీజేపీ పెంచుకుంది. ఫలితంగా 20 సీట్లు ఒంటరిగా సాధించింది. కర్ణాటకలో 5.32 శాతం ఓట్లను కోల్పోయిన బీజేపీ సీట్లు మాత్రం గణనీయంగా సాధించింది. పశ్చిమబెంగాల్లో 1.52 శాతం, బీహార్లో 1.11 శాతం, గుజరాత్లో 1.35 శాతం, మధ్యప్రదేశ్‌లో 1.27 శాతం, కేరళలో 3.15 శాతం ఓట్లను కాషాయ పార్టీ కోల్పోయింది. మొత్తం 7 రాష్ట్రాల్లో 12 సీట్లను కోల్పోయిన బీజేపీ.. ఒక్క ఒడిశాలో 12 స్థానాలను అదనంగా సాధించింది.