రాష్ట్రపతి ప్రసంగ సమయంలో కెమెరాలో ఎవరు ఎన్నిసార్లు కనిపించారో తెలుసా?

త్త లోక్‌సభ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 51 నిమిషాలపాటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్నుద్దేశించి ప్రసంగించారు

  • Publish Date - June 27, 2024 / 05:54 PM IST

న్యూఢిల్లీ: కొత్త లోక్‌సభ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 51 నిమిషాలపాటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్నుద్దేశించి ప్రసంగించారు. అయితే.. ఇందులో పదే పదే మోదీనే చూపించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మోదీని 73 సార్లు చూపిస్తే.. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని కేవలం ఆరుసార్లు మాత్రమే చూపించారని కాంగ్రెస్‌ ఆరోపించింది. రాహుల్‌గాంధీకంటే ఎక్కువసార్లు మోదీనే చూపించారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ విమర్శించారు. ప్రభుత్వ బెంచీలను 108 సార్లు, ప్రతిపక్ష సభ్యులను 18సార్లు చూపించారని పేర్కొన్నారు. ‘సంసద్‌ టీవీ ఉన్నది సభా కార్యక్రమాలను చూపించేందుకేకానీ.. ‘కెమెరాజీవి’ స్వరూప కాముకతను చూపించేందుకు కాదు’ అని జైరాం రమేశ్‌ చురకలు వేశారు.

అదే సమయంలో రాష్ట్రపతి తన ప్రసంగంలో ఎమర్జెన్సీ ప్రస్తావన తేవడంపైనా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మోదీ ప్రభుత్వం రాసిన రాష్ట్రపతి ప్రసంగం వింటుంటే.. మోదీ ఇంకా తిరస్కార ధోరణిలోనే ఉన్నట్టు కనిపిస్తున్నది. ప్రజా తీర్పు ఆయనకు వ్యతిరేకంగా వచ్చింది. ఎందుకంటే.. బీజేపీ 400పైగా సీట్ల నినాదాన్ని దేశ ప్రజలు తిరస్కరించి, బీజేపీని 272 సంఖ్యకు దూరంగా ఉంచారు’ అని పేర్కొన్నారు. ‘మోదీ దీన్ని ఒప్పుకొనేందుకు సిద్ధంగా లేరు. అందుకే ఏమీ మార్పు లేదన్నట్టు నటిస్తున్నారు. కానీ.. దేశ ప్రజలు మార్పును కోరారనేది వాస్తవం’ అని ఖర్గే తన పోస్టులో పేర్కొన్నారు. పాత ప్రసంగాలకు కొద్దిగా మార్పులైనా చేసుకుని ఉంటే బాగుండేదని కాంగ్రెస్‌ నేత తారిక్‌ అన్వర్‌ వ్యాఖ్యానించారు. పార్లమెంటులో రాష్ట్రపతి ఈ రోజు చేసిన ప్రసంగంలో కొత్తదేమీ లేదన్నారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో బీజేపీ కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదని అన్నారు.

Latest News