Site icon vidhaatha

Loksabha Elections 2024 | ఐదు దశల్లో ఓటేసినవారి వివరాలు ఇచ్చిన ఈసీ

ఇప్పటి వరకూ 50 కోట్ల మందికిపై ఓటేసినట్టు వెల్లడి

న్యూఢిల్లీ: ఓటింగ్‌ వివరాల వెల్లడికి ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నుంచి వెల్లువెత్తిన ఒత్తిడి, విమర్శలతో ఒక అడుగు వెనక్కు వేసిన కేంద్రం ఎన్నికల సంఘం ఇప్పటి వరకూ ముగిసిన ఐదు దశల పోలింగ్‌ వివరాలను శనివారం ప్రకటించింది. ఈసీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐదు దశల పోలింగ్‌లో మొత్తం 50 కోట్ల మందికిపైగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలి విడుతలో 11,00,52,103 మంది, రెండో విడుతలో 10,58,30,572మంది, మూడో విడుతలో 11,32,34,676 మంది, నాలుగో దశలో 12,24,69,319 మంది, ఐదో దశలో 5,57,10,618 మంది ఓటు వేశారని ఈసీ తెలిపింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు 96.88 కోట్ల మంది ఓటు హక్కు నమోదు చేసుకున్నారని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.

2019 ఎన్నికలు ముగిసిన తర్వాత తుది ఓటింగ్‌ లెక్కలను ఎన్నికల సంఘం ప్రకటించలేదు. ఫలితాలు ప్రకటించిన తర్వాత కూడా ఈసీ వెబ్‌సైట్‌లో ఉన్నవి ప్రాథమిక గణాంకాలు మాత్రమే. ఈసీ తన వెబ్‌సైట్‌లో వెల్లడించిన రెండు సెట్ల ఓటింగ్‌ గణాంకాల్లో తేడాలు ఉన్నట్టు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. లెక్కించిన ఓట్లకు, ప్రకటించిన ఓట్లకు మధ్య పొంతన లేదు. కొన్ని నియోజకవర్గాల్లో జరిగిన ఓటింగ్‌కంటే ఈవీఎంలలో పోలైన ఓట్లు ఎక్కువ ఉన్నాయనే వార్తలు కూడా వచ్చాయి. ఈ తేడాలపై దర్యాప్తు జరపాలని కోరుతూ 2019 నవంబర్‌ 15న ఎలక్షన్‌ వాచ్‌ డాగ్‌ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌), కామన్‌ కాజ్‌ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

అన్ని దశల్లో ఓటింగ్‌ ముగిసిన వెంటనే ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో రికార్డైన ఓటింగ్‌ వివరాలను వెంటనే ఈసీ తన వెబ్‌సైట్‌లో ప్రదర్శించేలా మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతూ ఏడీఆర్‌ మరోసారి కూడా సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై మే 24న విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఏడీఆర్‌ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఇప్పటి పిటిషన్‌ కూడా 2019లో వేసిన పిటిషన్‌ తరహాలోనే ఉన్నదంటూ విచారణను వాయిదావేసింది. పోలింగ్‌ ముగిసిన తర్వాత విడుదల చేసిన ఓటింగ్‌ శాతాలకు, తదుపరి ప్రచురించిన తుది శాతాలకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉన్నదని ఏడీఆర్‌ తన పిటిషన్‌లో ప్రస్తావించింది.

ఇదిలా ఉంటే.. ఈసీ ఐదు దశల పోలింగ్‌ తుది లెక్కలను విడుదల చేయడంపై సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది సమాచారం తెలుసుకునేందుకు ప్రజలకు ఉన్న హక్కకు లభించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. ఫాం 17సీ మాత్రమే చట్టబద్ధమైన ధృవీకరించిన పత్రం కనుక.. దాని కోసం పోరాడుతూనే ఉంటామని తెలిపారు.

 

Exit mobile version