Boy Dies | జైపూర్ : ఓ ఐదేండ్ల బాలుడు తుపాకీతో( Gun ) కాల్చుకున్నాడు. ఆ తర్వాత క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజస్థాన్( Rajasthan )లోని కోట్‌పుత్లి బెహ్రూర్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కోట్‌పుత్లి బెహ్రూర్ జిల్లా పరిధిలోని ఛితోలి గ్రామానికి చెందిన ముఖేశ్ తన భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. అయితే ఐదేండ్ల కుమారుడు దేవాన్ష్.. తన ఇంట్లో ఓ గదిలో ఆటాడుకుంటున్నాడు. ఇక ఇంట్లో ఉన్న తుపాకీని తన చేతుల్లోకి తీసుకుని ట్రిగ్గర్ నొక్కాడు. దీంతో బుల్లెట్( Bullet ) పిల్లాడి తలలోకి దూసుకెళ్లింది. శబ్దం విన్న కుటుంబ సభ్యులు ఆ గదిలోకి ప్రవేశించి చూడగా, బాలుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అక్రమంగా దేశీ తుపాకీని ఇంట్లో ఉంచుకున్న తండ్రి ముఖేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తండ్రి నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ముఖేశ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.