Forest Officers | బెంగళూరు : అటవీ శాఖ అధికారులపై( Forest Officers )అన్నదాతలు( Farmers ) కన్నెర్రజేశారు. తమ విజ్ఞప్తులను పట్టించుకోని అటవీశాఖ అధికారులను పులి బోను( Tiger Cage )లో నిర్బంధించారు. ఈ ఘటన కర్ణాటక( Karnataka )లోని గుంండ్లుపేట్ తాలుకా పరిధిలోని బొమ్మలపురా గ్రామంలో వెలుగు చూసింది.
బొమ్మలపురా( Bommalapura ) గ్రామ పరిధిలో గత కొన్ని నెలల నుంచి అడవి జంతువుల( Wild Animals ) బెడద ఎక్కువైంది. పశువులతో పాటు మనషులపై అడవి జంతువులు దాడులకు పాల్పడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. చాలా పశువులు కూడా అడవి జంతువుల దాడిలో ప్రాణాలు కోల్పోయాయి. జనాలు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు.
ఈ క్రమంలో అడవి జంతువులను గ్రామ శివార్లకు రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులకు పలుమార్లు గ్రామస్తులు, అన్నదాతలు విజ్ఞప్తి చేశారు. అడవి జంతువుల దాడిలో చనిపోయిన పశువులకు, గాయాలపాలైన వారికి నష్ట పరిహారం ఇవ్వాలని కూడా రైతులు డిమాండ్ చేశారు. కానీ అటవీ శాఖ అధికారులు స్పందించకుండా, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు.
ఈ క్రమంలో గ్రామానికి వచ్చిన ఓ ఏడుగురు అటవీ శాఖ అధికారులను, బలవంతంగా పులి బోనులోకి తోసేసి నిర్బంధించారు. తమ విజ్ఞప్తులపై స్పందించి, వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.