ఉత్తరప్రదేశ్‌లో వరద బీభత్సానికి జనం చస్తుంటే.. అది భగవంతుడి ఆశీస్సులని రాష్ట్ర మంత్రి సంజయ్ కుమార్ నిషాద్ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో, సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలకు దారి తీసింది. ‘గంగమ్మ తల్లి తన బిడ్డల కాళ్లు కడగటానికి వచ్చింది. గంగమ్మ తల్లి బిడ్డలు నేరుగా స్వర్గానికే వెళతారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. భోంగీపూర్ గ్రామం వద్ద యమునా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరద బాధితులను కలుసుకొనేందుకు ఇక్కడకు వచ్చిన మంత్రి.. వారి కష్టాలను పరిష్కరించేందుకు ఏం చేస్తారో చెప్పడం మానేసి.. ఇదంతా మహత్యంగా అభివర్ణించడం అక్కడున్నవారిని నిశ్చేష్టులను చేసింది.
Here, UP government minister Sanjay Nishad says- “Ganga Maayya comes to wash the feet of Gangaputras. The man goes straight to heaven” pic.twitter.com/CaqnWLReRL
— Hasan khan (@Hasankh33831912) August 5, 2025
నిజానికి ఆయన యమునా నదిని గంగా నదిగా పొరబడ్డారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు ఒక ఆట ఆడుకున్నారు. తన నియోజకవర్గం గురించి ఆయనకు ఏమీ తెలియదనే విషయం దీని ద్వారా వెల్లడైంది. ప్రజలను మూర్ఖులను చేస్తున్నారు’ అని ఒక యూజర్ ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. ‘వరదలను ఆశీర్వాదాలుగా పరిగణించాలని వాళ్లు అనుకుంటున్నారా?’ అని మరొకరు సందేహం వ్యక్తం చేశారు.
వరద తీవ్రత మంగళవారం కూడా కాన్పూర్‌లో కనిపించింది. గోవింద్‌నగర్, కిద్వాయి నగర్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో అధికారులు మోటర్లు ఏర్పాటు చేసి, కాలనీల నుంచి వరద నీటిని తోడేస్తున్నారు. అనేక వాహనాలు మునిగిపోయిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. ప్రజలు నడుం లోతు నీళ్లలో నడుచుకుంటూ పోవడం కనిపించింది.
A surprising incident from Prayagraj, in which flood water from the Ganges entered the house of Sub-Inspector Chandradeep Nishad, but he took a holy bath considering it the arrival of ‘Maa Ganga’ and now this video is going viral.#ViralVideo #SIChandradeepNishad #Prayagraj pic.twitter.com/kO8c1PTCz9
— Hardik Shah (@Hardik04Shah) August 4, 2025
గత వారం కూడా చంద్రదీప్ నిషాద్ అనే యూపీ పోలీస్ అధికారి.. తన ఇంటికి వచ్చిన వరద నీటికి పూజలు చేశాడు. ఆయన హైకోర్టు జడ్జికి పీఎస్‌వో కూడా. సాక్షాత్తూ గంగమ్మ తల్లే తన ఇంటికి వచ్చిందంటూ పూనకాలెత్తాడు. అదికూడా పోలీస్ యూనిఫాంలో ఉండి. తాను నివసించే వీధిలో తన ఇంటి ముందు వరద నీటికి పూలు చల్లుతూ, పాలు పోస్తూ ‘గంగా మాతకి జై’ అంటూ నినాదాలు చేశాడు. మరో వీడియోలో ఒక వ్యక్తి కూడా వరద నీటిలో ఈదుతూనే ‘వేల మంది భక్తులు నీ దగ్గరకు వస్తారు.. కానీ.. నువ్వే మమ్మల్ని ఆశీర్వదించేందుకు వచ్చావు..’ అంటూ పాటలు పాడాడు.
జనం వరదలతో అవస్థలు పడుతుంటే ఈ గోలేంటని కొందరు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తగిన మురుగునీటి పారుదల వ్యవస్థలేకే ఈ ఇబ్బందులని, ఈ విషయంలో యూపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఒక యూజర్ స్పందించాడు. మరొక యూజర్ సెటైర్‌లు వేస్తూ.. ‘మీ భక్తిలో అంత పవర్ ఉంటే.. గంగమ్మ తల్లి.. మీ ఇంటిని ఎప్పటికీ వదిలి వెళ్లదు’ అంటూ.. ఈ వరద నీటిలోనే అలానే ఉండిపొమ్మని శపించాడు.