Gross Domestic Behavior : స్థూల జాతీయోత్పత్తి, స్థూల రాష్ట్ర ఉత్పత్తి సంగతి తెలిసిందే. అయితే.. ఇండియా టుడే వినూత్నంగా స్థూల సామాజిక ప్రవర్తన అంశంపై ఒక సర్వే నిర్వహించగా.. ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. పౌరుల ప్రవర్తన ఎలా ఉన్నది? లింగ వివక్ష పరిస్థితేంటి? భద్రత అంశాలు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై దేశంలోని 21 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఇండియా టుడే సర్వే నిర్వహించింది. వివిధ అంశాల్లో కేరళ టాప్‌లో నిలువగా.. తమిళనాడు, పశ్చిమబెంగాల్ తదుపరి స్థానాల్లో నిలిచాయి. ఈ ప్రమాణాల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్ దిగువ స్థానాల్లో ఉన్నాయి. హౌ ఇండియా లివ్స్ అనే ఎనలిటిక్స్ సంస్థ సహకారంతో ఇండియా టుడే ఈ సర్వే నిర్వహించింది. ఉత్తరాది నుంచి ఒక్క రాష్ట్రం కూడా టాప్ 5 జాబితాలో చోటు దక్కించుకోలేక పోయాయి.
పౌర ప్రవర్తనలో..
నిబంధనలు పాటించడం వంటి విషయాలకు సంబంధించి పౌర ప్రవర్తన విభాగంలో ఆసక్తికర గణాంకాలు వెలుగుచూశాయి. రవాణా చార్జీలు ఎగవేతలను 85 శాతం మంది వ్యతిరేకించారు. అదే సమయంలో ఒక్క రైల్వేల్లోనే 2023-24 సంవత్సరంలో టికెట్‌లెస్ ప్రయాణం చేసినందుకు 3.6 కోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో 2,231.74 కోట్ల రూపాయలు జరిమానా కింద వసూలు చేశారు. మరో ఆసక్తికర అంశం.. పనులు కావాలంటే లంచాలు ఇచ్చేందుకు 61 శాతం మంది సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ టాప్‌లో నిలిచింది. చరాస్థి సంబంధిత లావాదేవీల్లో పన్నులు ఎగవేసేందుకు నగదుతో లావాదేవీలు నిర్వహించడానికి సిద్ధమని 52 శాతం మంది చెప్పారు. అదే సమయంలో పలు సానుకూల అంశాలు సైతం సర్వేలో వెల్లడయ్యాయి. ఆన్‌లైన్ చెల్లింపులకు 76 శాతం మంది సానుకూలత వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఢిల్లీ వాసులు 96 శాతం మంది డిజిటల్ చెల్లింపులకు అనుకూలంగా స్పందించారు. డిజిటల్ చెల్లింపులతో పన్ను ఎగవేతలకు చెక్ పెట్టడంతోపాటు అవినీతి తగ్గి, ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత చోటు చేసుకుంటుందని స్వీడన్ అనుభవం చెబుతున్నది. ఈ సర్వేపై స్పందించిన సోషియాలజిస్టు దీపాంకర్ గుప్తా.. ఏది సరైందో ఎక్కువ మంది ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, కానీ.. ఆచరణలో చూపడంలో మాత్రం విఫలమవుతున్నారని వ్యాఖ్యానించారు. భారతీయ పౌర లోపాల వెనుక అజ్ఞానమే కారణమనే భావనను ఈ సర్వే గణాంకాలు తోసిపుచ్చుతున్నాయని చెప్పారు.
లింగ వైఖరులు..
భారతదేశం ప్రగతిశీల, పితృస్వామిక వ్యవస్థల మధ్య చిక్కుకున్నట్టు జండర్ యాటిట్యూడ్స్ విషయంలో గణాంకాలు పేర్కొంటున్నాయి. లింగ వైఖరులకు సంబంధించి.. మరోసారి కేరళ టాప్‌లో నిలిచింది. ఉత్తరప్రదేశ్ చిట్టచివరి స్థానంలో ఉన్నది. కొడుకులకు అందించినట్టే కుమార్తెలకు కూడా సమాన విద్యావకాశాలు అందాలని 93 శాతం మంది పేర్కొన్నారు. వేరే రాష్ట్రాల్లో యువతులు తమ కెరీర్‌లను చూసుకునేందుకు 84 శాతం మంది సానుకూలత వ్యక్తం చేశారు. అదే సమయంలో కుటుంబపరమైన ప్రధాన నిర్ణయాల్లో పురుషులదే తుది నిర్ణయంగా ఉండాలని 69 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ప్రజాభద్రత
ప్రజాభద్రత విషయంలోనూ కేరళ టాప్‌లో నిలిచింది. తదుపరి స్థానాల్లో హిమాచల్ ప్రదేశ్, ఒడిశా ఉన్నాయి. ఉత్తమ ప్రవర్తన కలిగిన రాష్ట్రాల్లో తమిళనాడు టాప్‌లో నిలువగా.. చెత్త ప్రవర్తనతో కర్ణాటక నిలిచింది. తరచూ తాము వేధింపులను ఎదుర్కొంటున్నామని కర్ణాటకలోని 79 శాతం మంది తెలిపారు. మొత్తంగా 86 శాతం మంది ప్రజా రవాణా వ్యవస్థలు భద్రంగానే ఉన్నాయని చెప్పగా.. 44 శాత మంది మహిళలు తాము వేధింపులను ఎదుర్కొంటున్నామని తెలిపారు. వ్యవస్థపై నమ్మకం లేదని సంకేతాలు కూడా ఈ గణాంకాల్లో వెల్లడయ్యాయి. మొత్తంగా 84 శాతం మంది తమపై జరిగిన నేరంపై ఫిర్యాదు చేస్తామని చెప్పినా.. ఢిల్లీ వంటి నగరాల్లో ఎఫ్ఐఆర్ నమోదు శాతం చాలా స్వల్పంగా ఉన్నది. దొంగతనం జరిగిన సందర్భాల్లో బాధితులు చేసిన ఫిర్యాదులు అక్కడ 7.2 శాతంగా ఉన్నాయి.
వైవిధ్యం.. వివక్ష
మత, కులపరమైన వైవిధ్యం పట్ల భారతదేశం గర్విస్తున్నప్పటికీ.. పలు రాష్ట్రాల్లో పక్షపాతం కొనసాగుతున్నదని సర్వే తెలిపింది. కుల, మత వైవిధ్యంలో కూడా కేరళ టాప్‌లో నిలిచింది. మధ్యప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉన్నది. తమ ఇరుగుపొరుగున మత వైవిధ్యాన్ని 70శాతం మంది స్వాగతించారు. పని ప్రదేశాల్లో మతపరమైన వివక్షను 60శాతం మంది వ్యతిరేకించారు. ఈ విషయంలో కూడా కేరళ అగ్రస్థానంలో నిలిచింది. పని ప్రదేశాల్లో యజమాని మత వివక్ష చూపడాన్ని కేరళలో 88శాతం మంది వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా మతాంతర వివాహాలను 61 శాతం మంది వ్యతిరేకించగా.. 56 శాతం మంది సమర్థించారు.