Site icon vidhaatha

Dawood Ibrahim | పాకిస్తాన్‌ నుంచి దావూద్‌ ఇబ్రహీం పారిపోయాడా?

Dawood Ibrahim | ముంబై మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం గురించి అప్పుడప్పుడు వార్తలు బయటకు పొక్కుతుంటాయి. తాజాగా ఇలాంటిదే ఒక ఖబర్‌ బయటకు వచ్చింది. వాస్తవానికి.. ముంబై పోలీసులు ఏ క్షణమైనా తనను అంతమొందిస్తారన్న భయంతో మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం 1983లో దుబాయికి పారిపోయాడు. దుబాయిలో తన సామ్రాజ్యాన్ని ప్రారంభించాడు. దుబాయికి వెళ్లిపోయినా ముంబై పోలీసు వ్యవస్థ తన జేబులో ఉంటుందని చెప్పుకొనేవాడని ప్రతీతి. పలువురు సీనియర్‌ పోలీస్‌ అధికారుల ఇళ్లల్లో పెళ్లిళ్లకు ఐదారు లక్షలు నగదును కానుకగా పంపేవాడని చెబుతుంటారు. దుబాయికి వెళ్లిన దగ్గర నుంచే ఆయన ఎదుగుదలకు ఎలాంటి అడ్డంకులూ ఎదురుకాలేదు. దావూద్‌ దుబాయిలో ఉన్న సమయంలోనే పాకిస్తాన్‌ గూఢచార సంస్థ (ఐఎస్‌ఐ) ఆయనతో కాంటాక్ట్‌లోకి వచ్చిందని చెబుతారు. దావూద్‌కు పాకిస్తానీ పాస్‌పోర్ట్‌, నకిలీ ఐడీకార్డ్‌ అందించిందని, దానితో ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు కరాచీకి ప్రయాణించేందుకు అవకాశం కల్పించిందని అంటుంటారు. ఆ సమయంలోనే సాధారణ డాన్‌గా ఉన్న దావూద్‌.. ఇంటర్నేషనల్‌ టెర్రరిస్టుగా ఎదిగాడు.

ముంబై పేలుళ్లలో కీలక సూత్రధారి

పదేళ్ల తర్వాత 1993లో ముంబైలో వరుస బాంబు పేలుళ్ల విషయంలో ఐఎస్‌ఐతో కలిసి దావూద్‌ చురుకుగా పనిచేశాడు. బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం 1992 జనవరిలో శివసేన కార్యకర్తలు ముస్లింలపైన, వాని ఆస్తులపైనా తీవ్రస్థాయిలో దాడులు చేశారు. ఈ ఘటనల తాలూకు వీడియోలను దావూద్‌కు అతని గ్యాంగ్‌ సభ్యులు పంపేవారు. అక్కడి నుంచి ఐఎస్‌ఐతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. తన మొత్తం స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌ను ఐఎస్‌ఐ ఆధీనంలోకి తెచ్చాడు. టైగర్‌ మెమన్‌ నాయకత్వంలో తన గ్యాంగ్‌ సభ్యులను దుబాయికి తెప్పించి, అక్కడి నుంచి పాకిస్తాన్‌కు పంపి.. ఆర్డీఎక్స్‌ వాడకంలో శిక్షణనిప్పించాడు. ముంబై వరుస పేలుళ్లు దావూద్‌ గ్యాంగ్‌ ఎలాంటి మిలిటరీ శిక్షణ పొందాయో కళ్లకు కట్టాయి. ముంబై వరుస పేలుళ్ల ఘటనతో అతడి సత్తా తెలుసుకున్న ఐఎస్‌ఐ కూడా.. తమ ప్రతి పనిలో అతడిని భాగస్వామిని చేయడం ప్రారంభించిందని చెబుతారు. ఆఖరుకు పలువురు ఐఎస్‌ఐ అధికారులు సైతం బంగారం స్మగ్లింగ్‌, బాలీవుడ్‌ సినిమాలకు ఫైనాన్స్‌, తుపాకుల కొనుగోళ్ల వంటి విషయాల్లో దావూద్‌ గ్యాంగ్‌తో చేతులు కలిపేవారు. నీకింత నాకింత అని పంచుకునేవారు. కాలక్రమేణా దావూద్‌ ఇబ్రహీం పాకిస్తాన్‌కు అతిపెద్ద గూఢచర్య వనరుగా మారిపోయాడు. పాక్‌ రక్షణ శాఖలోని పెద్దపెద్ద వాళ్లతో రాసుకుపూసుకు తిరిగేవాడు. అతని చుట్టూ ఎల్లప్పుడూ భారీ భద్రత ఉండేది. ఎంతటి కార్యక్రమం అయినా సరే పాకిస్తాన్‌ నుంచి ఆయనను బయటకు వెళ్లనిచ్చేవారు కాదు.

2008లో మరో మారణకాండలో హస్తం

2008లో మరోసారి దావూద్‌ను ఐఎస్‌ఐ వాడింది. ఈసారి లష్కరే తాయిబా ఉగ్రవాదుల ముంబై మారణకాండ. ఈ దాడిలో పాల్గొన్న అజ్మల్‌ కసబ్‌, ఇతరులకు డీ గ్యాంగ్‌లో భాగమైన డీజిల్‌ స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌ అధిపతి మొహద్‌ అలీ ముంబైలో అన్ని వనరులు కల్పించాడు. ఆ సహకారంతోనే కసబ్‌ బ్యాచ్‌ ముంబైలో భయానక మారణకాండకు పాల్పడింది. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి చెలరేగిన నేపథ్యంలో మళ్లీ దావూద్‌ను ఉపయోగించుకుని ముంబైలో భారీ ఆపరేషన్‌కు ప్లాన్‌ చేసే అవకాశాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దావూద్‌ పాకిస్తాన్‌ నుంచి పారిపోయాడని శుక్రవారం కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే.. నిఘా వర్గాలు మాత్రం ఆ వార్తలను విస్పష్టంగా కొట్టిపారేస్తున్నాయి. అవసరమైతే దావూద్‌ను చంపేస్తుందే కానీ.. పాకిస్తాన్‌ నుంచి ఒక్క అడుగు కూడా దావూద్‌ను ఐఎస్‌ఐ బయట పెట్టనీయబోదని సీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. దావూద్ ఇబ్రహీం.. ఐఎస్‌ఐ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి మాత్రమే కాకుండా.. పాకిస్తాన్‌లో ఉండి పనిచేస్తున్నాడని ఆయన అన్నారు. ఆయనను పాకిస్తాన్‌ నుంచి బయటకు పంపే ప్రసక్తి లేదని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

పెళ్లైన మూడు రోజులకే యుద్దానికి..! భారత్ మాతాకీ జై నినాదాలతో నవ వధువు వీడ్కోలు
Indo Pak War: పాక్ కాల్పుల్లో.. మరో జవాన్ వీరమరణం
ఉద్రిక్తతలు మంచిది కాదు..చర్చించుకోండి: మార్కో రూబియో
సరిహద్దుల దిశగా పాక్ సైన్యం.. 26చోట్ల పాక్ డ్రోన్ల కూల్చివేత‌

Exit mobile version