తమిళ రాజకీయాల్లో .. నామ్‌ తమిళర్‌ కట్చి సంచలనం

అన్ని సీట్లూ గెలుచుకున్నామని సంతోషంలో ఉన్న అన్నాడీఎంకేకు, సీట్లు దక్కకుండా పోయాయని బాధపడుతున్న బీజేపీ, అన్నాడీఎంకేలకు కొత్త సవాలు తమిళనాట పుట్టుకొస్తున్నదా? అవును. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ 12 నియోజకవర్గాల్లో లక్షకు పైగా ఓట్లు తెచ్చుకున్నది

  • Publish Date - June 8, 2024 / 07:01 PM IST

తమిళనాట ప్రధాన పార్టీలను కలవరపెడుతున్న కొత్త శక్తి!
12 లోక్‌సభ సీట్లలో లక్షకు పైగా ఓట్లు..
ఆరు నియోజకవర్గాల్లో మూడో స్థానంలో
తమిళ రాజకీయాల్లో .. నామ్‌ తమిళర్‌ కట్చి సంచలనం

చెన్నై: అన్ని సీట్లూ గెలుచుకున్నామని సంతోషంలో ఉన్న అన్నాడీఎంకేకు, సీట్లు దక్కకుండా పోయాయని బాధపడుతున్న బీజేపీ, అన్నాడీఎంకేలకు కొత్త సవాలు తమిళనాట పుట్టుకొస్తున్నదా? అవును. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ 12 నియోజకవర్గాల్లో లక్షకు పైగా ఓట్లు తెచ్చుకున్నది. ఆరు స్థానాల్లో బీజేపీ, అన్నాడీఎంకేల తర్వాత మూడో స్థానంలో నిలిచింది. 2019లో తెచ్చుకున్న 3.8 శాతం ఓట్లను ఈసారి ఏకంగా మూడు రెట్లు.. అంటే 8.2 శాతానికి తెచ్చుకున్నది. రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్తులో తానొక బలీయమైన శక్తిగా ముందుకు రానున్నానని బలమైన సంకేతాలు పంపింది. ఆ పార్టీయే.. నామ్‌ తమిళర్‌ కట్చి (ఎన్టీకే). ఎన్టీకే పెరుగుదల నెమ్మదిగానే కనిపిస్తున్నప్పటికీ.. స్థిరంగా ఉండటం గమనార్హం. రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలకు ఇదొక హెచ్చరిక అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దాని నాయకుడు సీమన్‌ ఒంటిచేత్తో తన పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు.

గతంలో సినీ దర్శకుడిగా ఉండి.. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా మారిన సీమన్‌.. ఈ ఎన్నికల్లో ఏ కూటమిలోనూ చేరలేదు. తమిళ గుర్తింపు ఆవశ్యకత సిద్ధాంతంతో ఆయన ఇచ్చే ఉద్వేగపూరిత ఉపన్యాసాలు.. ఆయనకు ఒక నాయకుడి హోదాను ఆటోమెటిక్‌గానే తెచ్చిపెట్టాయి. 12 నియోజకవర్గాల్లో ఎన్టీకేకు లక్షకుపైగా ఓట్లు వచ్చాయి. అందులో శివగంగైలో లక్షా 63వేలకు పైగా ఓట్లు సాధించింది. కన్యాకుమారి, ఈరోడ్‌, కల్లకురిచి, నాగపట్నం, తిరుచిరాపల్లి, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్టీకే మూడో స్థానంలో నిలిచింది. ఈ ఎన్నికల్లో ఈ ఆరు సీట్లలోనూ ఇండియా కూటమి విజయం సాధించింది. రెండింటిలో బీజేపీ, మరో నాలిగింటిలో అన్నాడీఎంకే రెండో స్థానంలో ఉన్నాయి. మధ్య తమిళనాడులోలో ఎన్టీకే అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చింది. తిరుచిరాపల్లిలో ఓటు శాతాన్ని 10.18 శాతానికి పెంచుకుని, ఎన్డీయేను నాలుగో స్థానంలో నిలిపింది. నాగపట్నంలో 13.49శాతం, మైలాదుతురాయిలో 11.73శాతం, రాష్ట్రంలో బాగా వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన పెరంబదూర్‌లో 10.02 శాతం ఓట్లు కైవసం చేసుకున్నది.

రాష్ట్రంలో బీజేపీ చేసిన ఎన్నికల ప్రచారానికి మీడియాలో అధిక ప్రాధాన్యం కల్పించిన నేపథ్యంలో తమ ఓట్లు తగ్గుతాయని భావించామని సీమన్‌ సన్నిహితుడొకరు చెప్పారు. రాష్ట్రంలో డీఎంకే, జాతీయ స్థాయిలో బీజేపీ అధిక సీట్లు గెలుస్తాయని భావించామని అన్నారు. అయితే.. తాము రాష్ట్ర రాజకీయాలకే పరిమితమైన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఎవరూ ఓటు వేయరని చాలా మంది అనుకున్నారని, కానీ ఈసారి తాము కొత్త ఎన్నికల చిహ్నం మైక్ గుర్తుతో పోటీ చేసినప్పటికీ.. అందరి అంచనాలను సీమన్‌ పటాపంచలు చేశారని చెప్పారు.

2009లో మూకుమ్మడి దాడితో శ్రీలంక సైన్యం ఎల్‌టీటీఈని అంతమొందించిన అనంతరం ఎన్టీకే ఆవిర్భవించింది. ఆ సమయంలో తమిళ సెంటిమెంట్‌ తీవ్రస్థాయిలో ఉన్నది. ఆ సమయంలో శ్రీలంకలోని తమిళులు బాధితులైన అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ సందేశంతోనే తమిళనాడు ఓటర్లను, ప్రత్యేకించి యువతను ఆకర్షించారు. ఆయన విశ్వసనీయతను ఆయన ప్రత్యర్థులు పదేపదే సవాలు చేశారు. తమిళ సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారని ఆయనపై విమర్శలు కురిపించారు. రాజకీయ ఫండింగ్‌ కోసం తమిళ ఎన్నారైలను వాడుకుంటున్నారని ఆరోపించారు. కానీ.. ఆ విమర్శలను ఎన్టీకే తట్టుకుని నిలబడింది. సీమన్‌ మినహా స్టార్‌ ప్రచారకులు లేకపోయినా, డబ్బు బలం లేకపోయినా.. మీడియాలో కనీసం చోటు లేకపోయినా ఎన్టీకే సత్తా చాటింది.

వాస్తవానికి డీఎంకే దివంగత అధినేత ఎం కరుణానిధి, ఆ తర్వాత అన్నాడీఎంకే దివంగత అధినేత్రి జయలలితను కలిసిన సమయంలో సీమన్‌ నాస్తికత్వం గురించి, పెరియార్‌ హేతువాదం గురించి మాట్లాడారు. కానీ.. తర్వాత పూర్తిగా తమిళ జాతీయవాదం, జాతి గుర్తింపుపైనే కేంద్రీకరించారు. తమిళనాడు తిరిగి తన సాంస్కృతిక మూలాలకు వెళ్లాలని వాదించేవారు. ఈ క్రమంలోనే హిందూజాతి సిద్ధాంతాన్ని ప్రవచించే ఆరెస్సెస్‌, హిందూత్వ వాదాలను వ్యతిరేకించే బలమైన నాయకుడిగా ఎదిగారు. అప్పటి నుంచి ఏ కూటమి వైపూ మొగ్గు చూపలేదు. ప్రాంతీయ, జాతీయ పార్టీల నియంత్రణలోకి వెళ్లకుండా.. సొంతగా తమిళ ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలిచారు.

 

 

Latest News