Justice B. Sudarshan Reddy | న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి ఎన్నిక ఆసక్తికర మలుపు తిరిగింది. ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ. రాధాకృష్ణన్ ను ప్రకటించి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని ప్రతిపక్షాలను అభ్యర్థించింది. అయితే కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమి మాత్రం ఉప రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవ ప్రతిపాదనను తిరస్కరిస్తూ తమ అభ్యర్థిగా జస్టిస్ బీ. సుదర్శన్ రెడ్డిని ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించారు.
రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారంకు చెందిన వ్యవసాయ కుటుంబంలో 1946 జూలై 8న జన్మించిన బీ. సుదర్శన్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ, ఎల్ఎల్బీ చదివారు. న్యాయవాది వృత్తి నుంచి సుప్రీంకోర్టు జడ్జీగా ఎదిగారు. 2007జనవరి 12నుంచి 2011జూలై 8వరకు నాలుగున్నరేళ్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. పదవి విరమణ తర్వాత గోవా లోకాయుక్త చైర్మన్ గా కూడా పనిచేశారు.
ప్రస్తుతం పార్లమెంటు ఉభయ సభల్లో ఖాళీలలో కలిపి 786మంది సభ్యులున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికకు 394మంది సభ్యుల మెజార్టీ అవసరం. ఎన్డీఏకు లోక్ సభలో 293మంది, రాజ్యసభలో 129మందితో కలిపి మొత్తం 422మంది సభ్యుల బలం ఉంది. ప్రతిపక్ష ఇండియా కూటమికి లోక్ సభలో 234, రాజ్యసభలో 79మంది కలిసి మొత్తం 313మంది సభ్యుల బలం ఉంది.ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఎన్నిక లాంఛనమే కానుంది. అయితే క్రాస్ ఓటింగ్ పై నమ్మకంతో ఇండియా కూటమి తమ అభ్యర్థిగా జస్టిస్ బీ. సుదర్శన్ రెడ్డిని రంగంలోకి దించడంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగునుంది.