న్యూఢిల్లీ : ఇండియా కూటమి(INDIA Alliance Candidate) ఉప రాష్ట్రపతి(Vice President) అభ్యర్థి(Candidat)గా జస్జిస్ బి.సుదర్శన్ రెడ్డి(Justice B Sudarshan Redd)y గురువారం తన నామినేషన్ దాఖలు చేశారు. నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi) సహా ఇండియా కూటమి నేతలు హాజరయ్యారు. సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఇండియా కూటమికి చెందిన 20మంది ఎంపీలు సంతకాలు చేశారు. నామినేషన్ల దాఖలు గడువు ఈ రోజుతో ముగిసిపోనుంది. ఉప రాష్ఱ్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరుగనుంది. ఈ ఎన్నికల్లో ఆయన అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీ.పీ.రాధాకృష్ణన్ (CP Radhakrishnan)తో పోటీ పడుతున్నారు. రాధాకృష్ణన్ నిన్న బుధవారం తన నామినేషన్ దాఖలు చేశారు.
రైతు కుటుంబం నుంచి సుప్రీం జడ్జీ వరకు
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఆకులమైలారం గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో 1946జూలై 8న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1971లో న్యాయవిద్య పూర్తి చేశారు. అదే ఏడాది డిసెంబర్ 27న బార్ కౌన్సిల్ లో తన పేరు నమోదు చేసుకున్నారు. 1988-90 మధ్య హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. 1990లో కేంద్రం తరఫున అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వైజర్ గా, ఉస్మానియా యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్ గా, న్యాయసలహాదారుగా పనిచేశారు. 1995 మే2న లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియామితులయ్యారు. 2005 డిసెంబర్ 5న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.2007జనవరి 12నుంచి 2011జూలై 7వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహారించారు. 2013మార్చలో గోవా తొలి లోకాయుక్తగా నియామితులయ్యారు. అదే ఏడాది ఆక్టోబర్ లో ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఐఏఎంసీ శాశ్వత ట్రస్టీగా, బీసీ కులగణన అధ్యయన కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి మానవ హక్కుల పరీరక్షణ, చట్టబద్ద పాలన లక్ష్యంగా సల్వాజుడుంపై నిషేధం విధిస్తూ తీర్పు నిచ్చారు. అసైన్డ్ భూ సేకరణకు పరిహారం చెల్లింపుపైన కీలక తీర్పు వెలువరించారు.
ఎన్డీఏ – ఇండియా కూటమి బలాబలాలు
ప్రస్తుతం పార్లమెంటు ఉభయ సభల్లో ఖాళీలతో కలిపి 786మంది సభ్యులున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికకు 394మంది సభ్యుల మెజార్టీ అవసరం. ఎన్డీఏకు లోక్ సభలో 293మంది, రాజ్యసభలో 129మందితో కలిపి మొత్తం 422మంది సభ్యుల బలం ఉంది. ప్రతిపక్ష ఇండియా కూటమికి లోక్ సభలో 234, రాజ్యసభలో 79మంది కలిపి మొత్తం 313మంది సభ్యుల బలం ఉంది. సంఖ్యాబలం మేరకు ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే క్రాస్ ఓటింగ్ పై నమ్మకంతో ఇండియా కూటమి తమ అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని రంగంలోకి దించడంతో ఉప రాష్ట్రపతి ఎన్నిక ఆసక్తికరంగా మారింది.