- అరేబియా సముద్రంలో తేజ్
- బంగాళాఖాతంలో హమూన్
- ఒకేసారి రెండు తుఫాన్లు అరుదు
- చివరిసారిగా 2018లో ఈ వైచిత్రి
న్యూఢిల్లీ : ఒక అరుదైన సందర్భాన్ని భారత్ ఎదుర్కొనబోతున్నది. అటు అరేబియా సముద్రంలో, ఇటు బంగాళాఖాతంలో ఒకేసారి రెండు తుఫాన్లు ఏర్పడ్డాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన దానికి తేజ్ అని నామకరణం చేయగా.. బంగాళాఖాతంలో ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్న తుఫానుకు హమూన్ అని పేరు పెట్టనున్నారు.
ఇలా ఒకేసారి రెండు వైపులా తుఫాన్లు ఏర్పడటం 2018 తర్వాత ఇదే మొదటిసారి. ఈ రెండు తుఫాను కేంద్రాలు ఒకదానికొకటి సుమారు 2500 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. తేజ్.. అతి తీవ్ర తుఫానుగా మారేందుకు సిద్ధమవుతుండగా.. హమూన్ ఇంకా ప్రాథమిక దశలో ఉన్నది. నైరుతి అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్.. ఒమన్, యెమెన్ దక్షిణ తీరంవైపు కదులుతున్నదని భారత వాతావరణ విభాగం తెలిపింది.
బంగాళాఖాతంలో తయారవుతున్న హమూన్.. ఆంధ్రతీరం వైపు కదులుతున్నది. అయితే దీనిని పశ్చిమగాలులు దిశ మర్చే అవకాశం ఉన్నది. అయితే.. ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నది. పూర్తిస్థాయిలో తయారైతే.. దానికి హమూన్ అని పేరు పెడతారు. అక్టోబర్ 24 నాటికి ఇది తీవ్ర తుఫానుగా మారుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ పేర్కొన్నది. ఈ రెండు తుఫానులతోనూ పెద్దగా ప్రభావం లేదని, చెన్నై, తమిళనాడు కోస్తా ప్రాంతాల్లో కొంత ప్రభావం ఉంటుందని తెలిపింది.