Cyclone Montha Effect | హైదరాబాద్ : మొంథా తుపాను ఎఫెక్ట్( Cyclone Montha Effect )ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు.. పొరుగున ఉన్న తెలంగాణ( Telangana )పై కూడా ప్రభావం చూపుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం)( IMD Hyderabad ) ప్రకటించింది. ఈ తుపాను ఇవాళ ఉదయం తీవ్ర తుపానుగా మారనుంది. ఇవాళ సాయంత్రానికి లేదా రాత్రి వరకు కాకినాడ ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ( Weather ) శాఖ తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణలో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు( Heavy Rains ) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాలకు మొంథా తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ మూడు జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో 19 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
మిగిలిన తెలంగాణ ఈశాన్య జిల్లాలన్నింటికి ఎల్లో హెచ్చరికను జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ రావు వెల్లడించారు. దీంతో పాటు అరేబియా సముద్రం నుంచి ప్రవాహం వచ్చే అవకాశం ఉందని, పశ్చిమ వైపు ఉన్న నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు సైతం మంగళవారం ఎల్లో అలర్ట్ ఉండనున్నట్లు స్పష్టం చేశారు. బుధవారం ఆదిలాబాద్, కుమురంభీం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగిలిన నాలుగు నుంచి ఐదు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం వరకు తుపాను క్రమంగా ఉత్తరం దిశగా ప్రయాణించడంతో క్రమంగా దాని ప్రభావం తగ్గిపోతుందని చెప్పారు.
