Site icon vidhaatha

ప్రయాణికులకు తీపి కబురు..! ఇక రైలు టికెట్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు..!


విధాత‌: భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. టికెట్‌ను బుక్‌ చేసుకొని.. చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకునే వారి కోసం ఓ ప్రత్యేకంగా అవకాశాన్ని కల్పిస్తున్నది. ఇప్పటి వరకు ముందస్తుగా టికెట్‌ను రిజర్వేషన్‌ చేసుకుంటే.. ప్రయాణం చేయడమో.. లేదంటే రద్దు చేసుకోవడమే చేయాల్సి వచ్చేది. దీంతో డబ్బు వృథా అయ్యే అవకాశం ఉండేది. తాజాగా టికెట్‌ను మరో ప్రయాణికుడికి ట్రాన్స్‌ఫర్‌ చేసే అవకాశాన్ని రైల్వేశాఖ కల్పిస్తున్నది. కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకరికి టికెట్‌ను బదిలీ చేసేందుకు అవకాశం ఇస్తున్నది. అయితే, ప్రయాణానికి 24 గంటల ముందు రిక్వెస్ట్‌ను పెట్టుకోవాల్సి ఉంటుంది.


టికెట్‌ బదిలీ ఇలా..


ప్రయాణికులు తమ రైలు బయలుదేరే సమయానికి 24 గంటల ముందుగా రిజర్వేషన్‌ టికెట్‌ ట్రాన్స్‌ఫర్‌ కోసం రిక్వెస్ట్‌ పెట్టుకోవాల్సి ఉంటుంది. దీంతో ఒక ప్రయాణికుడి పేరుపై రిజర్వేషన్‌ అయిన టికెట్‌ మరొకరి పేరుపైకి బదిలీ అవుతుంది. ఎంప్లాయీస్‌ అయితే పండుగలు, పెళ్లిళ్లు, వ్యక్తిగత కారణాలతో ప్రయాణానికి 48 గంటల ముందుగా రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎన్‌సీసీ క్యాడెట్లకు సైతం ఇదే నిబంధన వర్తిస్తుంది. టికెట్‌ తన పేరిట బదిలీ కావాల్సిన ప్యాసింజర్‌ వెరిఫికేషన్‌ కోసం తప్పనిసరిగా ఐడీకార్డ్‌ను వెంట ఉంచుకోవాల్సి ఉంటుంది.


టికెట్‌ ట్రాన్స్‌ఫర్‌ ఇలా..


ముందుగా బుక్‌ చేసుకున్న టికెట్‌ను ప్రింట్‌ తీసుకోవాలి. ఆ తర్వాత దగ్గరలో ఉన్న రైల్వేస్టేషన్‌ రిజర్వేషన్‌ కౌంటర్‌ వద్దకు వెళ్లాలి. టిక్కెట్‌ను బదిలీ చేయాలనుకుంటున్న వ్యక్తి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ తదితర ఐడీల్లో ఏదో ఒక ఐడీని.. ఎవరి పేరుపైకి బదిలీ చేయాలనుకుంటున్నారో వారి ఐడీని జత చేసి ఫామ్‌ను ఫిల్‌ చేయాలి. దరఖాస్తులు కౌంటర్‌లో అందజేస్తే పరిశీలించి.. టికెట్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు.

Exit mobile version