8th Central Pay Commission | 8వ పే కమిషన్‌ టీఓఆర్‌కు క్యాబినెట్‌ పచ్చజెండా..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వేతనాలు, పెన్షన్ల సవరణకు 8వ పే కమిషన్‌ టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ను కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించింది.

8th Central Pay Commission | లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగుల అలవెన్సులు, పెన్షన్లను సవరించే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు 8వ కేంద్ర పే కమిషన్‌ టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ (ToR)ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. కమిషన్‌లో ఎవరెవరు ఉండాలి? ఉద్దేశం, టైమ్‌లైన్‌ను ఖరారు చేసినట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మంగళవారం ధృవీకరించారు. కొత్త వేతనాలు 2025 జనవరి నుంచి అమలులోనికి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని 48 లక్షల మంది ఉద్యోగులుకు, 67 మంది పెన్షనర్లకు ఇవి లబ్ధి కలిగించనున్నాయి. వివిధ రాష్ట్రాల పీఆర్సీలను సైతం ఇవి ప్రభావితం చేయనున్నాయి. గత ఏడవ సీపీసీ 2016లో అమలు చేశారు. అప్పటి నుంచి ద్రవ్యోల్బణం, జీవన వ్యయం, వినిమయ ధోరణలు గణనీయంగా మారిపోయాయి. దీంతో వేతనాలు సవరించాలని చాలా కాలం నుంచి ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రస్తుత వేతన స్లాబులు, అలవెన్స్‌, గ్రేడ్‌ పే వ్యవస్థలు, పెన్షన్‌ ఫార్ములాలు, ఇతర ఆర్థిక విషయాలపై కమిషన్‌ పరిశీలన జరుపుతుందని వైష్ణవ్‌ చెప్పారు. సూక్ష ఆర్థిక వాస్తవాలు, విత్త పరిగణనలు, ఉద్యోగాల కోసం నెలకొన్న పోటీ తదితరాలను కూడా కమిషన్‌ పరిశీలిస్తుందని తెలిపారు. ఇప్పుడు ఉన్న వేతన స్థాయిలు వాస్తవికంగా, భరించతగినవిగా ఉన్నాయా? జీవన ప్రమాణాలను కొనసాగించేందుకు, ప్రభుత్వ సర్వీసులలో నిపుణులను కొనసాగించుకునేందుకు చేయాల్సిన మార్పులను కూడా ప్యానెల్‌ నిర్ణయించనుంది.

ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇతోధికంగా వేతనాలు పెంచాలని, కనీస వేతనాన్ని సవరించాలని కోరుతుండగా.. ఆర్థిక నిపుణులు మాత్రంఏ పెద్ద మొత్తంలో వేతనాలు పెంచినట్టయితే విత్త సమస్యలు, ఎదురవుతాయని అంటున్నారు. ప్రత్యేకించి ప్రభుత్వం ఒకవైపు వృద్ధి ప్రాధమ్యాలు, మూల ధన పెట్టుబడి డిమాండ్లు, సంక్షేమానికి చేస్తున్న ఖర్చును సమతుల్యం చేసుకుంటున్న నేపథ్యంలో భారీ పెరుగుదలలు వీటిని ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆలోచనలు, అందుబాటులో ఉన్న వనరులు, ఉద్యోగుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.