- రెండు సార్లు వాయిదా అనంతరం నింగిలోకి రాకెట్
- సముద్రంపై సురక్షితంగా దిగిన క్రూ మాడ్యూల్
విధాత: గగన్‌యాన్ (Gaganyaan) ప్రాజెక్టులో తొలి అడుగును ఇస్రో (ISRO)విజయవంతంగా వేసింది. శనివారం ఉదయం జరిగిన టీవీ-డీ1 ప్రయోగం.. ఆద్యంతం సైన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చే ప్రక్రియను పరీక్షించడానికి ఇస్రో ఈ టీవీ డీ1 ప్రయోగాన్ని చేపట్టింది. అనుకున్న ప్రణాళిక ప్రకారం ఉదయం 8 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా తొలుత 8:30కు, తర్వాత 8:45 గంటలకు వాయిదా పడింది.
టీవీ-డీ1 (TV-D1) ప్రయోగం ఈ రోజు జరిగేలా లేదు. ‘ఆటోమేటిక్ లాంచ్ స్వీక్వెన్స్ ద్వారా రాకెట్ లాంచ్ అవ్వాల్సి ఉంది. కానీ అనుకున్న ప్రకారం జరగలేదు. ఎక్కడ పొరపాటు జరిగిందో చూడాల్సి ఉంది’ అని ఇస్రో తొలుత ప్రకటించింది. ఇక ఈ ప్రయోగం జరగడానికి మరికొన్ని వారాలు పడుతుందని అందరూ అనుకుంటున్న దశలో 10:00 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ టెస్ట్ వెహికల్‌ను తీసుకుని రాకెట్ ఆకాశం వైపు దూసుకెళ్లింది.
ప్రయోగం జరిగిన 61 సెకండ్లకు రాకెట్ 11.9 కి.మీ. ఎత్తుకు చేరగా.. ఆ సమయంలో రాకెట్ వేగం 1480 కి.మీ.గా ఉంది. ఈ క్రమంలో రాకెట్ ఫెయిల్యూర్ పరిస్థితిని సృష్టించడానికి రాకెట్ వ్యవస్థను షట్‌డౌన్ చేశారు. రాకెట్ షట్‌డౌన్ అయిన వెంటనే దాని పైభాగంలో ఉన్న క్రూ ఎస్కేప్ విభాగం ఉత్తేజితమై కాస్తంత ఎత్తుకు ప్రయాణించింది. ప్రయోగం జరిగిన సుమారు 90 సెకండ్ల తర్వాత 17 కి.మీ. ఎత్తులో క్రూ ఎస్కేప్ సిస్టం, క్రూ మాడ్యూల్ విడిపోయాయి. రాకెట్, క్రూ ఎస్కేప్ సిస్టం వెంటనే సముద్రంలో పడిపోగా.. క్రూ మాడ్యూల్ భాగం ప్యారాచూట్ల సాయంతో సముద్రంలో దిగింది.
శ్రీహరికోట షార్‌కు 10 కి.మీ. దూరంలో ఇది దిగిన ప్రదేశం ఉన్నట్లు సంబంధింత వర్గాలు వెల్లడించాయి. రాకెట్ దూసుకెళ్లడం దగ్గర నుంచి క్రూ మాడ్యుల్ దిగడం వరకు మొత్తం ప్రక్రియ 9 నిమిషాల్లో పూర్తయింది. ఈ ఈ ప్రక్రియ మొత్తం ఆటోమేటిక్ విధానంలోనే జరిగింది. ఈ ప్రయోగంలో టెస్ట్ వెహికల్ రాకెట్, క్రూ మాడ్యుల్, క్రూ ఎస్కేప్ సిస్టం తమ పనిని చక్కగా చేశాయని టీవీ డీ1 డైరెక్టర్ శివకుమార్ వెల్లడించారు. మాడ్యూల్ తమ చేతికి వచ్చాక మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. క్రూ మాడ్యుల్‌ను చెన్నై పోర్టులో నేవీ తమకు అప్పగిస్తుందని పేర్కొన్నారు. కాగా నేవీకి చెందిన ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ సరస్వతిలు మాడ్యుల్‌ను ఒడ్డుకు తీసుకురావడానికి సాయపడనున్నాయి.
ఇందుకే వాయిదా పడింది..
అయితే ప్రయోగం రెండు సార్లు వాయిదా పడటానికి దారి తీసిన కారణాలను ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్ మీడియాకు వెల్లడించారు. ‘తొలిసారి ఆలస్యం వాతావరణ ప్రతికూలతల వల్ల జరిగింది. ఆ తర్వాత లాంచింగ్‌ను ప్రారంభించినపుడు రాకెట్‌లో ఏదో లోపం ఉందని కంప్యూటర్ గుర్తించి మిషన్‌ను నిలిపివేసింది. అయితే ఇది వ్యవస్థలోని లోపమే తప్ప.. రాకెట్‌లో లోపం లేదని గుర్తించాం.
తర్వాత ఆ తప్పును వేగంగా సరిదిద్దాం. రాకెట్ ఇంజిన్‌లో ఇంధనాన్ని నింపి మళ్లీ ప్రయోగాన్ని కొనసాగించాం’ అని సోమనాథ్ పేర్కొన్నారు. ఇంత తక్కువ సమయంలో ఇలాంటి అడ్డంకులను ఎదుర్కొన్ని మిషన్ ను కొనసాగించడమనేది.. గగన్‌యాన్ మానవసహిత యాత్రకు మంచి శిక్షణగా తమ సిబ్బందికి ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.