Site icon vidhaatha

JDU | ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం లిఖితపూర్వక సమాధానంపై నితీశ్‌ పార్టీ కౌంటర్‌

ప్రత్యేక హోదా కల్పిస్తామని మీరే హామీ ఇచ్చారు!
కూటమికి అదే ప్రాతిపదికని గుర్తు చేసిన జేడీయూ
ప్రత్యేక హోదా బీహార్‌ సుదీర్ఘ డిమాండ్‌..
హోదా దక్కి తీరాల్సిందేనన్న సంజయ్‌ ఝా

న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా అంశం ఎన్డీయే కూటమిలో ఇబ్బందులు రేకెత్తించే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదాపై ఎన్డీయే భాగస్వామ్య పక్షం జేడీయూ పట్టుదలతో ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో హామీ ఉన్నా.. హోదాపై జేడీయూ స్థాయిలో పట్టుబట్టే ఉద్దేశంతో అధికార టీడీపీ లేదని అర్థమవుతున్నది. అదే సమయంలో జేడీయూ పట్టుబట్టడం వెనుక నిజాయితీ ఉన్నదా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో జేడీయూ నేత సంజయ్‌ ఝా అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. హోదా ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది.

దీనిపై జేడీయూ వర్గాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. కూటమికి ప్రాతిపదిక ప్రత్యేక హోదా హామీయేనని జేడీయూ వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాయి. రాష్ట్ర శీఘ్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతగానో ఉపకరిస్తుంది. అసలే పేద రాష్ట్రమైన బీహార్‌కు అందుకే జేడీయూ హోదా కోసం పట్టుబడుతున్నది. అయితే.. కేంద్రం నిరాకరించడంపై సంజయ్‌ కుమార్‌ ఝా మీడియాతో మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘బీహార్‌కు ప్రత్యేక హోదా దక్కాల్సిందే. ఇది మా దీర్ఘకాలిక డిమాండ్‌’ అని అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఇబ్బందులు ఏమైనా ఉంటే.. బీహార్‌ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ అయినా ఇవ్వాలని అన్నారు.

నితీశ్‌పై ఆర్జేడీ విమర్శలు

బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈ అంశంలో జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను ఆర్జేడీ టార్గెట్‌ చేసింది. కేంద్రంలో అధికార ఫలాలు అనుభవిస్తున్న నితీశ్‌కుమార్‌, జేడీయూ నాయకులు.. ప్రత్యేక హోదాపై వారి డ్రామా పాలిటిక్స్‌ను కొనసాగిస్తున్నారు’ అని ఆర్జేడీ తన సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పించింది.

Exit mobile version