Site icon vidhaatha

All-Party meeting | అఖిలపక్షంలో ప్రత్యేక ప్రతిపత్తి అంశాన్ని లేవనెత్తిన వైసీపీ, జేడీయూ, ఆర్జేడీ, బీజేడీ.. టీడీపీ వైఖరి?

న్యూఢిల్లీ: సోమవారం నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదివారం అఖిపక్ష సమావేశాన్ని నిర్వహించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షత వహించారు. రాబోయే సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వివిధ ప్రతపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. సమావేశంలో అధికార కూటమిలో ఉన్న జేడీయూ, ఏపీకి చెందిన వైసీపీ పార్టీలు తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తడం విశేషం. ఒడిశాకు సైతం ప్రత్యేక హోదా కల్పించాలని బీజేడీ డిమాండ్‌ చేసింది.

మరోవైపు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పోస్టును ప్రతిపక్షాలకు కేటాయించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. దానితోపాటు వివాదాస్పద నీట్‌ యూజీ అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీలను లేవనెత్తింది. కన్వర్‌ యాత్ర సందర్భంగా దుకాణదారులు తమ పేరు, మతం బోర్డులపై రాయాలన్న యూపీ ప్రభుత్వ ఆదేశాలు సైతం ప్రస్తావనకు వచ్చాయి. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కిరెన్‌ రిజిజు కోరగా.. పార్లమెంటులో అంశాలను లేవనెత్తేందుకు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ నాయకుడు గౌరవ్‌ గగోయ్‌ కోరారు.

నీట్‌ అంశాన్ని తాను ప్రముఖంగా ప్రస్తావిస్తామని రాజ్యసభ ఎంపీ, ఎగువ సభలో ప్రతిపక్ష ఉప నేత ప్రమోద్‌ తివారి చెప్పారు. ‘ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, ప్రశ్న పత్రాల లీకేజీ, చైనాతో రక్షణకు సంబంధించిన అంశాలు, పార్లమెంటులో విగ్రహాల తొలగింపు, రైతులు, కార్మికుల సమస్యలు, మణిపూర్‌, రైలు ప్రమాదాలు తదితర అంశాలను కాంగ్రెస్‌ లేవనెత్తుతుంది’ అని తివారి ఒక వార్తా సంస్థకు చెప్పారు.

అటు బీహార్‌ రాష్ట్రంలోనూ, ఇటు కేంద్రంలోనూ బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకుంటున్న జేడీయూ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశాన్ని లేవనెత్తింది. ఏపీలో ప్రతిపక్ష వైసీపీ సైతం ప్రత్యేక హోదా డిమాండ్‌ను లేవనెత్తినా.. బీజేపీ మిత్రపక్షం టీడీపీ ఈ విషయంలో మౌనం దాల్చడం విశేషం. బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ జేడీయూ ఇటీవలే ఒక తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. బీహార్‌ ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ కూడా ప్రత్యేక హోదా డిమాండ్‌ చేయగా.. తాజాగా బీజేడీ సైతం ఒడిశాకు ప్రత్యేక హోదా కోరింది.

అఖిలపక్షంలో జేడీయూ బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ను లేవనెత్తిన అంశాన్ని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ట్విట్టర్‌లో ధృవీకరించారు. ‘అఖిలపక్ష సమావేశంలో జేడీయూ బీహార్‌కు ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ నాయకుడు గట్టిగా డిమాండ్‌ చేశారు. టీడీపీ నాయకుడు మాత్రం ఈ విషయంలో మౌనం దాల్చారు’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. కన్వరియా దారిలో దుకాణదారులు తమ పేర్లను బోర్డుపై రాయాలన్న యూపీ ప్రభుత్వ వివాదాస్పద ఉత్తర్వులను సమాజ్‌వాది పార్టీ ఎంపీ రామ్‌గోపాల్‌ యాదవ్‌ లేవనెత్తారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నుంచి రమేశ్‌, కే సురేశ్‌, ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ, ఆర్జేడీ నేత అభయ్‌ కుశ్వాహా, జేడీయూ నేత సంజయ్‌ ఝా, ఆప్‌ నేత సంజయ్‌సింగ్‌, ఎస్పీ నేత రాంగోపాల్‌ యాదవ్‌, ఎన్సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు. సోమవారం ప్రారంభమయ్యే సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Exit mobile version