Site icon vidhaatha

Justice Hema Committee report | మలయాళ పరిశ్రమను కుదిపేస్తున్న హేమ కమిషన్‌ రిపోర్టు.. 17 కేసులు నమోదు

Justice Hema Committee report | మాలీవుడ్‌లో మహిళల పట్ల జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులపై జస్టిస్‌ హేమ కమిషన్‌ ఇచ్చిన నివేదిక పరిశ్రమను కుదిపివేస్తున్న నేపథ్యంలో కేరళ (Kerala) పోలీసులు వరుసబెట్టి కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 17 కేసులు నమోదు కాగా, రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వీటిలో నటుడు సిద్ధిఖి (Siddiqui)పై ఒక యువ నటి ఫిర్యాదు మేరకు రేప్‌ కేసును కూడా నమోదు చేశారు. 2016లో తిరువనంతపురంలోని ఒక హోటల్‌లో తనపై లైంగిక దాడి జరిగిందని ఆ నటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వయసు 21 ఏళ్లు ఉన్నప్పుడు ఒక హోటల్‌ రూమ్‌లో బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ నేపథ్యంలో మలయాళ సినీ పరిశ్రమ (Malayalam film industry) ఆర్టిస్టుల సంఘం ‘అమ్మ’ ప్రధాన కార్యదర్శి పదవికి సిద్ధిఖీ రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని తాను 2019లోనే చెప్పినీ ఏమీ జరుగలేదని, పైగా తనకు సినిమాల్లో అవకాశాలు దూరమయ్యాయని సదరు నటి పేర్కొన్నారు.

2013లో ఒక సినిమా షూటింగ్‌ సందర్భంగా ఒక గుర్తు తెలియని నటుడు తన వక్షస్థలాన్ని తాకాడని మరో నటి కేరళ డీజీపీ Kerala DGP)కి ఫిర్యాదు చేశారని మనోరమ న్యూస్‌ తెలిపింది. జయ సూర్య తనను వేధించినట్టు అంతకు ముందు మీడియాలో వచ్చిన వార్తలను సదరు నటి ఖండించారు. తన ఆరోపణలకు ఆయనతో ముడిపెట్టవద్దని కోరారు. ఆమె స్టేట్‌మెంట్‌ను సిట్‌ నమోదు చేసుకున్నది. నటులు జయసూర్య, ముకేశ్‌, ఎడవెల బాబు, మణియన్‌పిళ్ల రాజు తదితరులపై మూడో నటి ఫిర్యాదుల ఆధారంగా స్టేట్‌మెంట్‌లు రికార్డ్‌ చేసింది. డైరెక్టర్‌ రంజిత్‌పై ఒక బెంగాలీ నటి రహస్య స్టేట్‌మెంట్‌ను కూడా సిట్‌ నమోదు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో కేరళ ఫిలిం అకాడమి (Kerala Film Academy) చైర్మన్‌ పదవికి రంజిత్‌ (Ranjith) రాజీనామా చేశాడు. ఈ కేసులో రంజిత్‌ను కోస్టల్‌ ఏఐజీ పూన్‌కుళాలి ఇంటరాగేట్‌ చేసే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.

Exit mobile version